Begin typing your search above and press return to search.

మేనత్తను కాల్చింది మేనల్లుడు చింటూనేనా?

By:  Tupaki Desk   |   21 Nov 2015 4:50 AM GMT
మేనత్తను కాల్చింది మేనల్లుడు చింటూనేనా?
X
కుటుంబంలో నెలకొన్న విభేధాలు.. చిత్తూరు మేయర్ అనురాధ.. ఆమె భర్త మృతికి కారణం అయ్యాయా? అంటే అవుననే చెబుతున్నారు. అనురాధ మేనల్లుడు చింటూనే.. మేయర్.. ఆమె భర్త హత్యలకు స్కెచ్ గీసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మేయర్.. ఆమె భర్త హత్యల తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయిన ఇద్దరు నిందితులు చెప్పిన సమాచారం ప్రకారం.. మేయర్ అనురాధను అతి సమీపం నుంచి కాల్చింది మరెవరో కాదని.. చింటూనే అని చెప్పినట్లుగా తెలుస్తోంది.

తనన చంపొద్దంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా పాశవికంగా హత్య చేసింది ఆమెకు స్వయాన మేనల్లుడే అయిన చింటూనే అని లొంగిపోయిన నిందితులు పోలీసులకు వెల్లడించినట్లుగా చెబుతున్నారు. తాజాగా పోలీసుల విచారణలో నిందితులు.. మేయర్.. ఆమె భర్తను ఎలా హత్య చేసింది వివరంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. పోలీసులకు వారు చెప్పిన వివరాలు చూస్తే..

చింటూతో కలిసి.. అతడి అనుచరులు జయప్రకాశ్ రెడ్డి.. వెంకటా చలపతి.. మంజు.. వెంకటేష్ లు మేయర్ దంపతుల్ని హత్య చేయాలని ప్లాన్ చేశారు. దులో భాగంగా వారు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లారు. బురఖాలు ధరించిన వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. మేయర్ అనుచరులు అడ్డుకున్నారు. వారికి తుపాకీ చూపించి బెదిరించి ఛాంబర్ లోకి ప్రవేశించిన చింటూ.. మేయర్ అనురాధ నుదిటికి గురి పెట్టి కాల్పులు జరిపారు. దీంతో.. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

అదే సమయంలో చింటూ అనుచరులు మేయర్ భర్త మోహన్ పై కత్తులతో దాడి చేశారు. వారిని తప్పించుకునేందుకు మహన్ ప్రయత్నించారు. మేయర్ పై కాల్పులు జరిపిన చింటూ.. అనంతరం మోహన్ మీద కూడా కాల్పులు జరిపాడు. అయితే.. ఈసారి గురి తప్పి తలుపుకు తగిలింది. మరోసారి కాల్చే ప్రయత్నం చేస్తే తుపాకీ పని చేయలేదు. అయితే.. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టిన మోహన్... పొరపాటున రూమ్ లోని కార్పెట్ కారణంగా జారి కిందకు పడిపోయారు. ఈ సమయంలోనే చింటూ అనుచరులు మోహన్ ను వెనుకా ముందు చూసుకోకుండా నరికేశారు. అనంతరం తాము అనుకున్న పని పూర్తి కావటంతో చింటూ బాత్రూంలోకి వెళ్లి చేతులు కడుక్కొని మరీ.. ప్రహరీ గోడ దూకి పారిపోయాడు.

ముందుగా తాము ప్లాన్ చేసుకున్న ప్రకారం.. హత్యకు పాల్పడిన ఐదుగురు పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని భావించారు. కానీ.. ఇద్దరు మాత్రమే లొంగిపోగా.. మిగిలిన ముగ్గురు మాత్రం లొంగిపోలేదు. మొదట తన అనుచరులు ఇద్దరిని పోలీసులకు లొంగిపోవాలని చెప్పి.. తాను ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన చింటూ పత్తా లేకుండా పోయినట్లుగా వారు చెబుతున్నారు. నిందితులు వెల్లడించిన సమాచారంతో.. ఈ జంట హత్య కేసుల్లో మొదటి ముద్దాయిగా చింటూను పోలీసులు చేర్చారు.