Begin typing your search above and press return to search.

బీజేపీకి మరో షాక్...ఆ కేంద్ర‌మంత్రి పార్టీ బైబై

By:  Tupaki Desk   |   27 July 2018 2:31 PM GMT
బీజేపీకి మరో షాక్...ఆ కేంద్ర‌మంత్రి పార్టీ బైబై
X
ఇప్ప‌టికే ఇర‌కాటంలో ప‌డ్డ బీజేపీకి మ‌రో స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ ఆ పార్టీకి మ‌రో పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల్లో టీడీపీ ఇప్పటికే వెళ్లిపోగా.. శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని స్పష్టంచేసింది. దీంతో అవాక్క‌వుతున్న బీజేపీ తాజాగా మరో భాగస్వామ్య పార్టీ ఝ‌ల‌క్ ఇచ్చింది. కేంద్ర‌మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సార‌థ్యంలోని లోక్ జనశక్తి పార్టీ బీజేపీ సార‌థ్యంలోని కూట‌మికి బైబై చెప్తాన‌ని ప్ర‌క‌టించింది. ఇందుకు ఎస్సీ - ఎస్టీ చ‌ట్టాన్ని సాకుగా చూపింది. ఈ మేర‌కు ఎల్‌ జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు - ఎంపీ చిరాగ్ పాశ్వాన్ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు.

ఎస్సీ - ఎస్టీ చట్టాన్ని ప్రయోగించిన సందర్భంలో వెంటనే అరెస్ట్‌ లు ఉండకూడదని - ప్రాథమిక విచారణ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వం వేసిన రీవ్యూ పిటిషన్‌ ను కూడా కోర్టు అంగీకరించలేదు. సవరణల ద్వారా ఈ చట్టం పటిష్ఠతకు కావాల్సిన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వంపై ఎన్డీయే పక్షాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్ర‌మంత్రి పాశ్వాన్ సార‌థ్యంలోని ఎల్‌ జేపీ మోడీ సర్కార్‌ కు అల్టిమేటం జారీ చేసింది. పార్లమెంట్ వ‌ర్షాకాల‌ సమావేశాలు ముగిసేలోపు ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టానికి సవరణలు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించింది. ``దళితులు సహనం కోల్పోతున్నారు. ఆగస్ట్ 9లోపు మా డిమాండ్లు నెరవేర్చకపోతే దళిత్ సేన వీధుల్లోకి వస్తుంది. ఎల్‌ జేపీ ఏ నిర్ణయానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలను వాయిదా వేసి, ఎస్సీ/ఎస్టీ చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలి`` అని చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు.

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మిత్రపక్షాల్లో లుక‌లుక‌లు ఇటీవ‌ల హాట్ టాపిక్‌ గా మారుతున్నాయి. ఇప్పటివకే శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగుతామని ప్రకటించగా, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుంటే కూటమిలో కొనసాగే అంశాన్ని పునరాలోచిస్తామని యూపీ మంత్రి - ఎస్బీఎస్పీ అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌ భర్‌ తేల్చేశారు. తమను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘సంకీర్ణ ధర్మం’ పాటించడం లేదని ఇటీవ‌ల మీడియాతో చెప్పారు. యూపీ ప్రభుత్వంలో అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తున్నారని - ఎస్సీ - ఎస్టీ - బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదని ఓం ప్రకాశ్‌ రాజ్‌ భర్‌ ఆరోపించారు. స‌రిగ్గా అదే ఆరోప‌ణ‌తో మ‌రో మిత్ర‌ప‌క్షం డెడ్‌ లైన్ విధించ‌డం గ‌మ‌నార్హం.