Begin typing your search above and press return to search.

పవన్ కంటే చిరంజీవి వెయ్యి రెట్లు నయమట

By:  Tupaki Desk   |   26 Jan 2018 5:54 PM GMT
పవన్ కంటే చిరంజీవి వెయ్యి రెట్లు నయమట
X
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గుర్తుందా... ఓటేసినవారు మర్చిపోయారేమో కానీ - ఆ పార్టీలో చేరి రాజకీయ జీవితం నాశనం చేసుకున్నవారు మాత్రం ఇంకా మర్చిపోలేదు. ప్రజారాజ్యంతో కోలుకోలేని దెబ్బలు తిన్నవారు చాలామందే ఉన్నారు. వారంతా ఇప్పుడు జనసేన పార్టీని చూసి ఓ మాట చెప్తున్నారట. ప్రజారాజ్యంలో చేరి కోలుకోలేని దెబ్బతిన్నామని.. జనసేనను చూస్తుంటే - ఇది అంతకంటే దారుణంగా లేవలేని దెబ్బకొట్టేలా ఉందని అంటున్నారట. చిరంజీవి అనుభవం కొంత.. పవన్ అనుభవలేమి మరికొంత కలిసి జనసేనపై రాజకీయవర్గాల్లో ఏమాత్రం నమ్మకం కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే పవన్ కంటే చిరంజీవి వెయ్యి రెట్లు నయం అన్న మాట కూడా ఇటీవల కాలంలో వినిపిస్తోంది.

రాజకీయ పార్టీలకు - రాజకీయ నాయకులకు సిద్దాంతాలు - లక్ష్యాలతోపాటు వైఖరులు ఉంటాయి. సిద్దాంతాలను బలంగా ఆచరించే పార్టీలు కొన్నే ఉన్నా - ప్రతిపార్టీ కనీసం రాజకీయ వైఖరినైనా స్పష్టంగా కలిగి ఉంటాయి - ప్రతినిత్యం దాన్ని కనబరుస్తాయి. అధికారంలో ఉన్నా - ప్రతిపక్షంలో ఉన్నా... స్వింగ్ లో ఉన్నా - చతికిలబడినా... ఏ పొజిషన్లో ఉన్నా కూడా తమ వైఖరేంటన్న విషయంలో రాజకీయ పార్టీలు స్పష్టతతో ఉంటాయి. ఆ వైఖరే రాజకీయ పార్టీలకు ఆకర్షణ. పార్టీల్లో ఆకర్షణ గల నేతలున్నప్పుడు అది మరింత బలమవుతుంది. వైఖరన్నది లేకపోతే ఎంత ఆకర్షణ ఉన్న నాయకుడి పార్టీ అయినా అది జనాల్ని ఆకట్టుకోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా రుజువైన సత్యం. జనసేన పార్టీకి ఘనమైన సిద్దాంతాలను ప్రకటించారు.. బయటకు చెప్పినవి - చెప్పనివీ లక్ష్యాలూ ఉన్నాయి. కానీ... లోపించిందంతా వైఖరిలో స్పష్టతే. అందుకేనేమో ప్రజల్లో... ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల కోసం ఎప్పుడూ ఎదురుచూసే రాజకీయ నేతల్లో జనసేనపై ఒక స్పష్టమైన అంచనా కనిపిస్తోంది. పవన్‌ ది ఫ్రీలాన్స్ పాలిటిక్స్ అన్న మాట అడుగడుగునా వినిపిస్తోంది.

పవన్ ఆంధ్రప్రదేశ్‌ కే పరిమితమైనంతకాలం చాలామంది అంతో ఇంతో ఆశపెట్టుకున్నారు - కొందరైతే.. పవన్‌ ను మరీ అంత తేలిగ్గా తీసుకోలేం అని కూడా అన్నారు. అప్పటి వరకు పవన్ - జనసేన పార్టీలో టీడీపీ ప్రో వైఖరి కనిపించేది. కానీ.. ఆయన తెలంగాణ యాత్ర మొదలుపెట్టిన మరునిమిషం నుంచి ఆయనపై ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోయిందంటున్నారు విశ్లేషకులు. ఏ రోటికాడ ఆ పాట పాడడం తప్ప పవన్ ఇంకేమీ చేయలేరన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఈ సందర్భంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి జనంలోకి వచ్చినప్పటి రోజులను చాలామంది గుర్తుచేసుకుంటున్నారు. చిరుకి రాజకీయ సలహాదారులుండేవారు.. వారు సినీ సలహాదారులు కాదు. తన వైపు ఆకర్షితులైనవారికి చిరంజీవి కనీసం నమ్మకం కలిగించగలిగారు. ఏం చెప్పినా స్పష్టంగా చెప్పారు. తన పార్టీని చిరు కాంగ్రెస్ లో కలిపేస్తే కలిపేసి ఉండొచ్చు కానీ, పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినప్పుడు మాత్రం ఇతర పార్టీలకు ప్రచారం చేయలేదు. రాష్ర్టాన్ని ఏలాలన్న కోరికను ఆయన స్పష్టంగా కనబర్చారు. అదే ఆయనపై అందరికీ నమ్మకం కలిగేలా చేసింది. నాయకుడికి స్పష్టమైన, బలమైన లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం ఆయన పోరాడుతారన్న నమ్మకం వెనుకున్నవారికి కలుగుతుంది. అంతేకాదు.. చిరంజీవి తన పార్టీని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. జనసేన విషయంలో అలాంటిది కనిపించడం లేదు..

కానీ.. పవన్ విషయానికొస్తే అవేమీ లేవు. ఆయన వెంట ఒక్కటి కూడా రాజకీయ ముఖమన్నది కనిపించడం లేదు. ఆయన పిడికిలి బిగించి ఆవేశంగా మాట్లాడడానికి డైలాగులు రాసేవారు... అడపాదడపా ప్రశ్నించడానికి ట్వీట్లు రాసేవారు తప్ప రాజకీయ అనుభవం ఉన్నవారు.. కనీసం రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారు.. రాజకీయంగా ఎదగాలన్న కలలు ఉన్నవారు.. రాజకీయ చైతన్యం ఉన్నవారు కూడా ఉన్నట్లు లేరు. అంతెందుకు, ఆయన కంటే ఎక్కువగా రాజకీయాల్లో అనుభవం గడించిన ఆయన అన్న చిరంజీవి కూడా లేరు. అందుకే ఆఫ్ లైన్ - ఆన్ లైన్ అన్న తేడా లేకుండా ఇప్పుడో మాట వినిపిస్తోంది. అది.. ‘జనసేన కంటే ప్రజారాజ్యం వెయ్యి రెట్లు నయం’. జనసేన ఇప్పటికైనా ఒక రాజకీయ వైఖరన్నది కలిగి ఉండకపోతే - ప్రచార పార్టీగానే మిగిలిపోక తప్పదన్న మాట అంతటా వినిపిస్తోంది.