Begin typing your search above and press return to search.

చిరు, రజినీ సపోర్ట్.. సుమలత నామినేషన్

By:  Tupaki Desk   |   19 March 2019 7:30 AM GMT
చిరు, రజినీ సపోర్ట్.. సుమలత నామినేషన్
X
కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో దివంగత కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత ఒంటరిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీ అయ్యారు. మాండ్య ప్రజల అభిమానంతోనే రాజకీయాల్లోకి వచ్చానని.. లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నానని తెలిపారు. ఈనెల 20న నామినేషన్ దాఖలు చేస్తానని సుమలత వెల్లడించారు.

బెంగళూరులో తొలిసారి ఆమె మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు. అంబరీష్ మృతి తర్వాత ఆయన సంస్మరణ సభ కోసం మాండ్యాకు వెళ్లానని.. అప్పుడే అభిమానులు అంబరీష్ పై అభిమానంతో తనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సూచించారని సుమలత తెలిపింది. అంబరీష్ ఆశయాలను కొనసాగిస్తానన్నారు. శాంతియుత జీవనమా.. రాజకీయాలా అని బాగా ఆలోచించే రెండో దారి ఎంచుకున్నానని తెలిపారు.

మూడు వారాలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నానని.. తనపై అభిమానంతో అందరూ పోటీచేయాలని కోరడంతోనే 20న ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేస్తున్నానని సుమలత తెలిపారు. తనకు బెంగళూరు దక్షిణ, ఉత్తర ఎంపీ సీట్లు ఇస్తామన్నారని.. ఇక ఎమ్మెల్సీ పదవులు ఇస్తామన్నారని.. కానీ అవన్నీ కాదని.. తాను అంబరీష్ స్వస్థలం మాండ్యా నుంచే పోటీచేస్తున్నానని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తను మద్దతు ఇస్తున్నారని ఆమె సమాధానమిచ్చారు. గెలిచాక ఏ పార్టీలో చేరాలనేది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయిస్తానన్నారు.

ఇక తనకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని.. వారు తనను రాజకీయాల్లోకి వెళ్లడం సరైన నిర్ణయమని ప్రోత్సహించారని సుమలత తెలిపింది. అయితే వారు తన తరుఫున ప్రచారం చేసే అంశం చర్చకు రాలేదన్నారు.