Begin typing your search above and press return to search.

పీకే ఫ్యాన్స్ కోరిక‌!...'అన్న‌య్య' రావాల్సిందే!

By:  Tupaki Desk   |   25 March 2019 10:52 AM GMT
పీకే ఫ్యాన్స్ కోరిక‌!...అన్న‌య్య రావాల్సిందే!
X
ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఇటీవ‌లే అసెంబ్లీ ఎన్నిక‌లు ముగించుకున్న తెలంగాణ‌లోనూ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో అక్కడ కూడా ఓ మోస్త‌రు వేడి ఉన్నా... ఏపీలో లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగుతున్నందున రాజ‌కీయం రంజుగా సాగుతోంది. నిన్న‌టిదాకా ప్ర‌ధాన పోటీ అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీల మ‌ధ్యేన‌న్న వాద‌న వినిపించింది. పార్ట్ టైం పొలిటీషియ‌న్ ముద్ర వేసుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద్ద‌గా పొడిచేదేమీ లేద‌ని కూడా విశ్లేష‌ణ‌లు జ‌రిగాయి. అయితే ఎన్నిక‌లు స‌మీపించిన నేప‌థ్యంలో వామ‌ప‌క్షాల‌తో పాటు బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్‌... రాష్ట్రంలోని దాదాపుగా అన్ని స్థానాల నుంచి కూడా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించే య‌త్నం చేస్తున్నట్టుగానే క‌నిపిస్తున్నారు. అయితే అంత‌టా జ‌న‌సేన పెద్ద‌గా సోదిలో లేకున్నా... త‌న‌కు ప‌ట్టున్న ఓ నాలుగైదు జిల్లాల్లో పవ‌న్ డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌ గానే ప‌నిచేసే అవ‌కాశాలున్నాయ‌ని ఇప్పుడిప్పుడే కొత్త విశ్లేష‌ణ‌లు మొద‌లయ్యాయి.

ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌కు మంచి ఊపును ఇచ్చే వార్త ఒక‌టి ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప‌వ‌న్ అన్న‌య్య - టాలీవుడ్ మెగాస్టార్‌ - రాజ‌కీయాల్లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయిన చిరంజీవి... జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ప‌వ‌న్ అడిగారో - లేదో తెలియ‌దు గానీ... జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేష‌న్‌ కు చిరు చెప్పేశార‌ట‌. ఈ మేర‌కు ఫ్యాన్స్ అంద‌రికీ చేరేలా ఓ ఎస్ ఎంఎస్‌ ను చిరు పంపిన‌ట్టుగా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌జారాజ్యంతో ఎదురైన చేదు అనుభ‌వాల‌ను మ‌న‌నం చేసుకుంటున్న చిరు ఇక రాజ‌కీయాల‌కు రార‌నే భావ‌న అయితే ఉంది. అయితే తాను రాకున్నా... త‌న అభిమానులంతా ప‌వ‌న్‌ కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డితే జ‌న‌సేన‌కు ప్ల‌స్సే క‌దా అన్న కోణంలో ఆలోచించిన చిరు... ఈ మెసేజ్‌ను పంపిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ వార్త జ‌న‌సైనికుల్లో కొత్త ఉత్సాహం నింపినా... వారిని పూర్తి స్థాయిలో సంతృప్తి ప‌ర‌చ‌లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... నాడు ప్ర‌జారాజ్యంలో యువ‌రాజ్యం అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ ఓ రేంజిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు ప‌వ‌న్ పార్టీ పెట్టి పోటీకి దిగుతున్న నేప‌థ్యంలో త‌మ్ముడి పార్టీకి కొత్త ఊపిరి ఊదేందుకు చిరునే డైరెక్ట్‌ గా రంగంలోకి దిగితే బాగుంటుంది క‌దా అన్న‌ది ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ మాట‌గా వినిపిస్తోంది. క‌నీసం ఇచ్చే మ‌ద్ద‌తు అయినా బ‌హిరంగంగా ప్ర‌క‌టిస్తే బాగుంటుంది క‌దా అని కూడా ఓ సెక్ష‌న్ అభిమానులు కోరుతున్నార‌ట‌. మ‌రి త‌మ్ముడి అభిమానుల ఆశల‌ను - కోరిక‌ల‌ను చిరు తీరుస్తారో - లేదో చూడాలి.

ఇదిలా ఉంటే... చిరు త్వ‌ర‌లోనే మీడియా స‌మావేశం పెట్ట‌నున్న‌ట్టుగా మీడియా వర్గాల్లో మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ మీడియా మీట్ త‌న సినిమాల‌కు సంబంధించిన‌ది కాద‌ని, రాజ‌కీయప‌ర‌మైన అంశమేన‌న్న‌ది కూడా తెలుస్తోంది. నిన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వ‌రరెడ్డి స్వ‌యంగా ఇంటికి వ‌చ్చి మ‌రీ చిరును క‌లిశారు. ఈ ఎన్నిక‌ల్లో తాను కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్నాన‌ని - త‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయాల‌ని ఆయ‌న కోరిన‌ట్టుగా స‌మాచారం. చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న ద‌గ్గ‌రి బంధువు అయిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి అభ్య‌ర్థ‌న‌కు చిరు ఎలా స్పందిస్తారో తెలియ‌దు గానీ... మీడియా మీట్ అనే దాకా ప‌రిస్థితి వ‌చ్చిందంటే... విశ్వేశ్వ‌ర రెడ్డికి మ‌ద్ద‌తు గురించి మాట్లాడ‌తారా? లేదంటే విశ్వేశ్వ‌ర‌తో పాటు త‌న త‌మ్ముడి పార్టీకి కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారా? అన్న అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.