Begin typing your search above and press return to search.

మెగాస్టార్ పొలిటికల్ ముచ్చట్లు.. వద్దన్నా దూకేశారట

By:  Tupaki Desk   |   28 Sep 2019 4:21 PM GMT
మెగాస్టార్ పొలిటికల్ ముచ్చట్లు.. వద్దన్నా దూకేశారట
X
టాలీవుడ్ లో మెగాస్టార్ ఇమేజీని సంపాదించుకున్న చిరంజీవి... రాజకీయాల్లోనూ అదే తరహాలో రాణించాలని ఉవ్విళ్లూరారు. అయితే సినిమా వేరు, రాజకీయం వేరు కదా... అందుకే సినిమాల్లో మాదిరిగా చిరు రాజకీయాల్లో రాణించలేకపోయారు. అంతేకాకుండా సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన... ఇప్పుడు రాజకీయాలను వదిలి మల్లీ ముఖానికి రంగు వేసుకోక తప్పలేదు. ఇదంతా తెలిసిన సంగతులే కదా. మళ్లీ ఇప్పుడు ప్రస్తావించడం ఎందుకంటారా? ఎందుకేమిటండీ బాబూ.. రాజకీయాలను వదిలేసి ఎంచక్కా తనకు అచ్చి వచ్చిన సినిమాలను చేసుకుంటున్న చిరునే ఈ ప్రస్తావన వచ్చేలా చేస్తున్నారు. ఎంతైనా రాజకీయాల్ోలకి దిగి తాను విఫలమైనా... తన మంత్రి కోరికను తీర్చేసుకున్న చిరు... ఆ రాజకీయ వాసనలను ఎంతమాత్రం మరిచిపోలేకపోతున్నారు. సో... చిరు కారణంగానే ఆయన రాజకీయ ప్రస్థానంపై మరోమారు మనం చర్చించుకోవాల్సి వచ్చిందన్న మాట.

సరే... అసలు విషయం ఏమిటంటే... తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చిరుకు ఓ విలువైన సలహా ఇచ్చారట. సినిమా వాళ్లమైన మనకు రాజకీయాలెందుకు? అక్కడ మనం నెగ్గలేం... రాజకీయ తెరంగేట్రం విరమించుకోవాలని చిరుకు అమితాబ్ సలహా ఇచ్చారట. అయితే నాడు అమితాబ్ ఇచ్చిన సలహా ఎంత విలువైనదో గుర్తించే స్థితిలో చిరు లేరట. అమితాబ్ సలహాను పక్కనపెట్టేసి మరీ చిరు రాజకీయాల్లోకి వచ్చారు. ఘోరంగా విఫలమయ్యారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఏదో అలా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలు ఎలాంటివో తెలుసుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చేశారు. పాలిటిక్స్ నుంచి తిరిగి రాగానే ఎంచక్కా ఖైదీ నెంబర్ 150 పేరిట బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు. తాజాగా సైరా నరసింహారెడ్డి పేరిట మరో భారీ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాల్లో చిరుతో పాటు బిగ్ బీ కూడా నటిస్తున్నారు.

చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ సందర్బంగా చిరు, అమితాబ్ లు పక్కపక్కనే కూర్చుని చిరు పాలిటిక్స్, నాటి అమితాబ్ సలహాలను వారే స్వయంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా చిరు ఏమన్నారన్న విషయానికి వస్తే... నాడు పాలిటిక్స్ లోకి నేను ఎంట్రీ ఇస్తున్న సమయంలో అమితాబ్ వద్దని వారించారు. అయితే ఆయన మాటను నేను వినలేదు. వెళ్లాను. బాధపడ్డాను‘ అని చిరు వివరించారు. పక్కనే ఉన్న అమితాబ్ కూడా ఇదే అంశాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ చిరు రాజకీయాల్లోకి వెళుతుంటే వద్దని వారించాను. అయినా ఆయన నా మాట వినలేదు. ఇదే సలహాను ఇప్పుడు రజనీకాంత్ కు కూడా ఇచ్చాను. ఆయన కూడా వినడం లేదు’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు. అయినా ముగిసిపోయిన సంగతుల గురించి ఇప్పుడు చిరు ప్రస్తావించడం ఎందుకో, వాటిని అమితాబ్ కూడా గుర్తుచేసుకోవడం ఎందుకో తెలియడం లేదన్న వాదన వినిపిస్తోంది.