Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యాన్ ని... చంపిన చిరు అభిమాని

By:  Tupaki Desk   |   28 March 2016 11:29 AM IST
పవన్ ఫ్యాన్ ని...  చంపిన చిరు అభిమాని
X
సినిమా.. రాజకీయ నేతల అభిమానుల అభిమానం ఓ రేంజ్ లో ఉంటుంది. తాము అభిమానించే వారి కోసం వారు ఎంతకైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి గొడవే కర్ణాటకలోని బళ్లారిలో జరగటమే కాదు.. చివరకు ఆ వాదన కాస్తా హత్యకు దారి తీయటం విస్మయానికి గురి చేస్తోంది. అయితే.. ఈ అభిమానులు ఇద్దరూ చిరంజీవి.. పవన్ కల్యాణ్ కు చెందిన వారు కావటం మరింత షాకింగ్ కలిగించే అంశం.

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేదిక నుంచి మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన అన్న చిరంజీవి అంటే ఎంత అభిమానమన్న విషయాన్ని చెప్పటమే కాదు... చిరంజీవి లేనిపక్షంలో తాను అసలు సినిమా యాక్టర్ ను అయ్యే వాడినే కాదని చెప్పుకొచ్చారు. తన అన్న మాటల కారణంగానే తాను యాక్టర్ని అయినట్లుగా పదే పదే చెప్పటం మర్చిపోకూడదు.

అంతేకాదు.. తన తల్లిదండ్రుల తర్వాత తన అన్నే తనకు అన్నీ అని చెప్పిన పవన్ కల్యాణ్.. తన అన్న మీద ఉన్న ప్రేమను సమయం వచ్చినప్పుడు ప్రదర్శిస్తానని చెప్పటం తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య అనుబంధం ఈ రేంజ్ లో ఉంటే.. బళ్లారికి చెందిన కోల్ బజారులోని ఇద్దరు అభిమానులు స్నేహితులు.. వారు ఈ మధ్యనే కలిశారు. మాటల మధ్యలో తాము ఎంతగానో అభిమానించే నాయకుల ముచ్చట్లు రావటం.. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని వాదులాడుకోవటం.. ఇది కాస్త గొడవకు దారి తీసింది.

ఆవేశంతో ఉన్న చిరంజీవి అభిమాని ఇనుప రాడ్ తో కొట్టటంతో పవన్ అభిమాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉదంతం కొద్దిరోజుల కిందట జరిగినా తాజాగా బయటకు వచ్చింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.