Begin typing your search above and press return to search.

చిరంజీవికి ఛాన్సొచ్చింది!

By:  Tupaki Desk   |   2 Nov 2018 11:05 AM GMT
చిరంజీవికి ఛాన్సొచ్చింది!
X
టాలీవుడ్ మెగాస్టార్‌ గా సినిమాల్లో చిరంజీవి ఎంత ఎదిగారో - రాజ‌కీయంగా చిరంజీవి అంత కోల్పోయారు. ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటే... అస‌లు ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేవారే కాదేమోన‌ని అనిపిస్తుంది. సినిమాల‌లో చాలాకాలం అప్ర‌తిహ‌తంగా నెంబ‌ర్ 1 స్థానం పొందిన చిరంజీవి ఎన్టీఆర్ లాగే ఆ చ‌రిష్మాతో సీఎం అవ్వొచ్చ‌ని ప్ర‌జారాజ్యం పెట్టారు. అయితే, ఆనాటికి రాష్ట్రంలో రాజ‌కీయ శూన్య‌త లేదు. ఇద్ద‌రు ఉద్దండులు రంగంలో ఉన్నారు. ఒక‌రు సీఎం వైఎస్‌. ఇంకొరు మాజీ సీఎం చంద్ర‌బాబు. ఆ ఇద్ద‌రినీ త‌ట్టుకుని నిల‌దొక్కుకోలేక‌పోయారు చిరంజీవి. ఇక ఆ త‌రువాత ప‌రిణామాల్లో ఒక పార్టీని ప్ర‌తిప‌క్షంలో ఉండి న‌డ‌పడం త‌న వ‌ల్ల అయ్యే ప‌ని కాద‌ని చిరంజీవి ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాడు. అందులో భాగంగా కాంగ్రెస్‌ లో పార్టీని విలీనం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యే లు కొంద‌రికి రాష్ట్రంలో ప‌ద‌వులు వ‌చ్చాయి. ఆయ‌న‌కు కేంద్రంలో మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ ఓడిపోవ‌డంతో చిరంజీవి మంత్రి పద‌వి పోయింది. ఆ త‌ర్వాత కొంత కాలానికి రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వీ కాలం కూడా ముగిసింది. అయితే, ప‌ద‌వీకాలంలో ఉన్న‌ట్లే చిరంజీవి మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇక రాజ‌కీయాలు మ‌న‌కు ప‌డ‌వు అనుకున్నారేమో వ‌రుస సినిమాల‌పైనే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ కోరినా కూడా ఆయ‌న త‌న కాంగ్రెస్ స‌భ్య‌త్వాన్ని రెన్యువ‌ల్ చేసుకోలేదు. అలా అని పార్టీకి రిజైన్ చేయ‌లేదు. మ‌రోవైపు త‌మ్ముడు పార్టీలో ఉంటే బాగుంటుంద‌ని కుటుంబ స‌భ్యుల నుంచి ఒత్తిడి ఉన్నా చిరంజీవి వేచిచూసే ధోర‌ణిలో ఉన్నారు. త‌న స్థాయికి ఈ వ‌య‌సులో పార్టీ మార‌డంపై కొంత సందిగ్ద‌తతో ఉన్నారు. ఈ టైంలో చంద్రబాబు -కాంగ్రెస్ ఒక‌టి కావ‌డం చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ వీడ‌డానికి ఒక మంచి త‌రుణంలా క‌నిపిస్తోంది.

త‌న‌కు ప్ర‌త్య‌ర్థి అయిన చంద్ర‌బాబు క‌ల‌యిక‌ను సాకుగా చూపి చిరంజీవి రాజ‌కీయాల్లోంచి త‌ప్పుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి జ‌న‌సేన‌లోకి చేర‌డానికి కూడా ఇదే మంచి త‌రుణం. స్వార్థం కోసం కాంగ్రెస్‌ ను వ‌దిలి జ‌న‌సేన‌లోకి పోయాడు అనే నింద - విమ‌ర్శ ప‌డ‌కుండా కాంగ్రెస్ ఇచ్చిన ఈ ఛాన్స్‌ తో చిరంజీవి సులువుగా బ‌య‌ట‌ప‌డి జ‌న‌సేన‌ పార్టీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రి ఈ అవ‌కాశాన్ని రాజ‌కీయంగా కొన‌సాగ‌డానికి వాడుకుంటారా? లేక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డానికి ఉప‌యోగించుకుంటారా అన్న‌ది వేచిచూడాలి.