Begin typing your search above and press return to search.

అన్నయ్యా...! ఈ పని అప్పుడు చేయాల్సింది

By:  Tupaki Desk   |   6 Aug 2015 11:20 AM GMT
అన్నయ్యా...! ఈ పని అప్పుడు చేయాల్సింది
X
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి పార్లమెంటులో దూసుకెళ్తున్నారు. చొక్కా మడత నలగకుండా వంద మందితో ఫైట్లు చేసిన అనుభవమున్న మెగాస్టార్ పార్లమెంటులో కఠిక నేలపై కూర్చుని నిరసన తెలిపారు పాపం. లోక్‌సభలో 25 మంది కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ పై మూడు రోజులుగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ నేతలంతా ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆందోళనలో భాగంగా గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి ముందువరుసలో నేలపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విభజన తరువాత కనిపించకుండా పోయిన చిరంజీవి ఇటీవల అనంతపురం జిల్లాలో రాహుల్ పర్యటన సందర్భంగా మళ్లీ స్పీడందుకున్నారు. ఆ రోజు కూడా మైకు పట్టుకుని మోడీని తిట్టేసి రాహుల్ దగ్గర మార్కులు కొట్టేశారు. ఇప్పుడు కూడా సోనియా ఉన్నంతసేపు నేలపై కూర్చుని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే... చిరు స్పీడుకు అభిమానులు ముచ్చటపడుతున్నా అదేసమయంలో ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను సోనియాగాంధీ అడ్డగోలుగు విభజించినప్పుడు ఈ స్పీడు ఏమైంది అన్నయ్యా అని అడుగుతున్నారు. అప్పుడు ఈమాత్రం దూకుడు చూపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు రక్షించిన ఘనత నీకు దక్కేది కదా చిరూ అంటున్నారు. మొత్తానికి చిరంజీవి సినిమాల్లోనే కాదు... రాజకీయాల్లోనూ తెగ నటించే్స్తున్నారు.