Begin typing your search above and press return to search.

చిరు జంపింగ్ ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 Nov 2016 11:30 AM GMT
చిరు జంపింగ్ ఉండ‌ద‌ని ఆయ‌న చెప్పేశారు
X
విష‌యం ఏదైనా అవ‌కాశం దొరికితే ప్ర‌త్యర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుండే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి - తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. స‌తీమ‌ణితో క‌లిసి తిరుప‌తి వెంకటేశ్వ‌రుడిని సంద‌ర్శించుకున్న దిగ్విజ‌య‌స్ సింగ్ అనంత‌రం తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్‌ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఏపీ నుంచి మొద‌లుకొని యూపీ వ‌ర‌కు అన్ని అంశాల‌పై మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి టీడీపీలో చేర‌డంపై దిగ్విజ‌య్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు.

డిసెంబ‌ర్ 5న చిరంజీవి అధికార టీడీపీలో చేరునున్నార‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టంపై మీ స్పంద‌న ఏమిట‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా..ఒకింత ఆలోచిస్తూ "చిరంజీవి త‌న 150వ చిత్రంలో బిజీగా ఉన్నారు. అందుకే టీడీపీలో చేర‌క‌పోవ‌చ్చు" అంటూ తేల్చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసమే కేంద్రంతో రాజీ పడ్డారని దిగ్విజ‌య్ సింగ్‌ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ముసుగులో పెద్ద ఎత్తున నిధులు దండుకోవడానికి చంద్రబాబు ముందస్తు ప్రణాళిక రూపొందించుకున్నారని ఆరోపించారు. వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని దిగ్విజ‌య్ సింగ్‌ చెప్పారు. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో సీపీఎం మినహా మిగిలిన పార్టీలన్నీ ఆమోదం తెలిపాయనీ, విభజనకు మద్దతుగా లేఖలూ సమర్పించాయనీ దిగ్విజ‌య్ సింగ్ గుర్తు చేశారు. ఇప్పుడేమో టీడీపీ- బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను నిందించడమే పనిగా పెట్టుకున్నారని డిగ్గీరాజా మండిప‌డ్డారు. ఎన్నో మాట‌లు చెప్పిన కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు అవ‌న్నీ ప‌క్క‌న‌పెట్టి ప్యాకేజీతో స‌రిపుచ్చార‌ని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు మంచి అవకాశాలున్నాయనీ దిగ్విజ‌య్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ పర్యటనలో రైతుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/