Begin typing your search above and press return to search.

ఫొటో ఆఫ్ ది డే.. జగన్-చిరు 'సైరా'..

By:  Tupaki Desk   |   14 Oct 2019 9:11 AM GMT
ఫొటో ఆఫ్ ది డే.. జగన్-చిరు సైరా..
X
రాజకీయం.. సినిమాయిజం.. ఈ రెండు వేరు వేరు దారులు... అయితే తెలుగునాట మాత్రం రెండింటికి దగ్గరి సంబంధాలున్నాయి. తెరను ఏలిన వాళ్లు తెలుగు రాజకీయాలను ఏలారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేటి చిరంజీవి - పవన్ - బాలక్రిష్ణ వరకు రాజకీయ యవనికపై దూసుకొచ్చిన వారే..

అయితే తాజాగా అరుదైన కలయిక ఒకటి అమరావతి సాక్షిగా చోటుచేసుకుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్ తో లంచ్ భేటి జరిపారు. కుటుంబ సమేతంగా జగన్ ఇంటికి వచ్చిన చిరంజీవి తన ‘సైరా’ సినిమాను వీక్షించాలని ఆహ్వానించారు.

చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. స్వయంగా సీమ బిడ్డ అయిన జగన్ కు.. పైగా ఏపీ ముఖ్యమంత్రికి ఆ రాష్ట్రంలో ఒకప్పుడు జరిగిన రాయలసీమ స్వాతంత్ర్య చరిత్రను చూపించేందుకు నడుం బిగించారు. కర్నూలు జిల్లాకు చెందిన పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వాళ్లతో సలిపిన పోరాటంపై తాను తీసిన చిత్రాన్ని వీక్షించాలని ఏపీ సీఎంను స్వయంగా చిరంజీవి కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో చిరంజీవి - వైఎస్ జగన్ కూడా కొద్దికాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి ఇదే కాంగ్రెస్ లో కేంద్రమంత్రి అయ్యారు. ఇక కాంగ్రెస్ ను వీడి వైసీపీ పెట్టి జగన్ సొంతంగా పోరాడారు. ఇప్పుడు చిరు తమ్ముడు పవన్ ఏపీలో యాక్టివ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. జగన్ కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఏపీ సీఎం ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏపీ సీఎంను టాలీవుడ్ ప్రముఖులు కలవడం లేదన్న విమర్శలకు చెక్ చెబుతూ ఏకంగా మెగాస్టార్ చిరు జగన్ ఇంటికి సతీసమేతంగా లంచ్ భేటికి హాజరుకావడం విశేషంగా మారింది...