Begin typing your search above and press return to search.

పవన్ రాజకీయాల ప్రస్తావన తేని చిరు

By:  Tupaki Desk   |   28 Dec 2018 4:44 AM GMT
పవన్ రాజకీయాల ప్రస్తావన తేని చిరు
X
రాంచరణ్ హీరోగా.. డీవీవీ దానయ్య నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వినయ విధేయ రామ’. ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. టీఆర్ ఎస్ నేత కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాజరైన అభిమానులు - మెగా ఫ్యాన్స్ జనసేన పార్టీ జెండాలు - గ్లాసులు పట్టుకొని హల్ చల్ చేశారు..

మొదట మాట్లాడిన రాంచరణ్ బాబాయ్ పార్టీని వేయినోళ్ల పొగిడారు. జనసేనకు వచ్చిన గాజు గ్లాస్ గురించి.. బాబాయ్ ఆశయాల గురించి ప్రస్తావించారు. పవన్ పై ప్రేమను బయటపెడుతూ ఈ మధ్య ఎవరూ జ్యూసులు తాగడం లేదని.. గాజు గ్లాసులో టీ తాగుతున్నారంటూ పవన్ ఎన్నికల గుర్తును ప్రస్తావించి హుషారెత్తించారు.

ఇక కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు పవన్ గురించి మాట్లాడాలని ఈలలు - గోలలు వినిపించాయి. చివరకు అభిమానుల కోరిక మేరకు కేటీఆర్ కూడా మాట్లాడక తప్పలేదు. పవన్ రాజకీయాలతోపాటు సినిమాలు కూడా చేయాలని కేటీఆర్ కోరారు.

చివరగా మాట్లాడిన అన్నయ్య చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ పార్టీ గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ్ముడు పవన్ హైదరాబాద్ లో లేడని.. ఉంటే ఈ ఫంక్షన్ ను చూస్తూ ఎంజాయ్ చేసి ఆశీర్వాదాలు ఇచ్చేవాడన్నారు.. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పవన్ స్విట్జర్లాండ్ వెళ్లాడని.. కుటుంబంతో క్రిస్మస్ సెలవులను జరుపుకుంటున్నాడని సెలవిచ్చారు. అంతేతప్ప పవన్ పార్టీ గురించి ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’ గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు.

మెగా హీరోలంతా పవన్ వెంట నడుస్తున్నాడు. నాగబాబు అయితే పవన్ మీద ఈగ వాలనీయడం లేదు. వరుణ్ తేజ్ ఇటీవలే కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఇక రాంచరణ్ అయితే బాబాయ్ కోరితే శ్రీకాకుళంలో ఆర్వో ప్లాంట్లను పంపిణీ చేశారు. ఇలా అందరూ జనసేన తరుఫున పాటుపడుతున్నా అన్నయ్య చిరంజీవి మాత్రం కాంగ్రెస్ ను వదిలేశాక రాజకీయాలంటేనే దూరంగా జరుగుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలంగాణ ఎన్నికల వేళ వస్తే కనీసం మర్యాదకైనా కలవలేదు. బహుశా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనే తమ్ముడు పవన్ పార్టీని కూడా ప్రస్తావించడం లేదనకుంటా.. మరి రాబోయే ఎన్నికల్లో చిరంజీవి ఎలాంటి పాత్ర పోషిస్తాడు.. జనసేన తరుఫున ఏమైనా ప్రచారం చేస్తాడా? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.