Begin typing your search above and press return to search.

అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలో చిరంజీవి హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   1 Oct 2021 10:48 AM GMT
అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలో చిరంజీవి హాట్ కామెంట్స్
X
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి నేడు.దీన్ని మెగా ఫ్యామిలీ ఒక పండుగలా నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో ‘అల్లు’ స్టూడియో నిర్మాణలో ఆయన మనవలు హీరోలు అయిన అల్లు అర్జున్, శిరీష్, బాబీ పాల్గొనగా.. రాజమండ్రిలో హోమియోపతి వైద్యశాలను నిర్మించి అక్కడ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని అల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాజీ మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజమండ్రి నేలను తలుచుకొని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఇది నేను పుట్టి పెరిగిన గడ్డ అని చెప్పుకొచ్చాడు. నేను నటుడిగా జన్మించింది రాజమండ్రిలోనే అని వివరించారు. నా మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలోనే చిత్రీకరణ జరిగాయని వివరించారు. నాది, అల్లు రామలింగయ్య గారిది గురుశిష్యుల సంబంధం అన్నారు.

ఈ సందర్భంగా మామ అల్లు రామలింగయ్య గొప్పతనం గురించి చిరంజీవి వివరించారు. ‘సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట పుట్టేది. ఎన్ని యాంటసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదు. అల్లు రామలింగయ్య గారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి చేత్తో తీసినట్టు మాయమైపోయింది. ఇవాళ్టికి మా కుటుంబం హోమియోపతి మందులే వాడుతాం.. హోమియోపతిలో తగ్గని జబ్బే లేదు అని చిరంజీవి వివరించారు.

రాజ్యసభ ఎంపీగా ఉండడం వల్లే తాను ఈ ప్రాంతానికి అభివృద్ధికి నిధులు తీసుకురాగలిగానని చిరంజీవి వివరించారు. సంజీవని లాంటి హోమియోపతి వైద్యం చిరంజీవిగా ఉండాలని ఆకాంక్షించారు. హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ లు లేని వైద్యం అని.. ఈ వైద్యానికి ప్రాచుర్యం రావాలని అన్నారు.