Begin typing your search above and press return to search.

ఏపీకి 3 రాజధానులు: జగన్ కు జైకొట్టిన చిరు

By:  Tupaki Desk   |   21 Dec 2019 10:54 AM GMT
ఏపీకి 3 రాజధానులు: జగన్ కు జైకొట్టిన చిరు
X
ఏపీకి మూడు రాజధానులు అవసరమంటూ ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పవన్ అయితే దుమ్మెత్తి పోస్తున్నారు.

అయితే తాజాగా జనసేనాని పవన్ ఈ మూడు రాజధానులను వ్యతిరేకిస్తుంటే ఆయన అన్న, మెగాస్టార్ చిరంజీవి మాత్రం పవన్ కు షాకిచ్చాడు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి స్వాగతించడం విశేషం. చిరంజీవి తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

చిరంజీవి మాట్లాడుతూ ‘అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమే’నని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని చిరంజీవి ప్రశంసించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

అమరావతిని అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలో ఉన్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేశారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందన్నారు. మూడు రాజధానులపై ఉన్న అపోహలు, అపార్థాలను ప్రభుత్వం వెంటనే తొలించాలని చిరంజీవి ప్రభుత్వానికి సూచించారు. సాగు,తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్ కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుందని అన్నారు.

రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు ,అభద్రతాభావాన్ని జగన్ సర్కారు తొలగించాలని చిరంజీవి సూచించారు. వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలు నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని సూచించారు. తాజా చిరంజీవి వ్యాఖ్యలు జనసేనాని పవన్ ను తీవ్రంగా ఇరుకునపెట్టాయి.