Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఎజెండా ఇళయరాజా మాత్రమే!

By:  Tupaki Desk   |   6 Feb 2018 7:46 AM GMT
మెగాస్టార్ ఎజెండా ఇళయరాజా మాత్రమే!
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఢిల్లీలో మాత్రమే కేంద్రీకృతం అయి ఉన్నట్లుగా.. వ్యవహారాలు మొత్తం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఏపీ కి సంబంధించినంత వరకు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ... అసలు రాజకీయ వాసన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒకటే అంశం గురించి మాట్లాడుతున్నారు. ఆవేదన చెందుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... అదే బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి! కానీ ఒకే ఒక రాజకీయ నాయకుడు మాత్రం ఈ అంశాల గురించి నోరు మెదపడం లేదు. ఆయన మరెవ్వరో కాదు. మెగాస్టార్ చిరంజీవి.

ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీ. ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్ వరకు ఉన్నది. ఆయన పార్టీ అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో లేకపోవచ్చు గాక.. కానీ పార్లమెంటులో వారి ప్రతినిధుల పోరాటం సాగుతోంది. కానీ ఆ పోరాటంలో మెగాస్టార్ మాత్రం కనిపించడం లేదు.

ఇంతకూ మెగాస్టార్ ఏం చేస్తున్నారు. ఇప్పటికప్పుడు సైరా షూటింగ్ లో హడావిడిగా ఉన్నారో లేదో తెలియదు. మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి బడ్జెట్ సమర్పణ తర్వాత.. గత నాలుగైదురోజుల్లోగా వార్తల్లో ఆయన పేరు ఒకే ఒక్క విషయంలో వచ్చింది. పద్మవిభూషణ్ పురస్కారం పొందిన ఇళయరాజాను టాలీవుడ్ తరఫున సత్కరించడానికి అందరితోనూ మాట్లాడి.. ఈనెల 17 న కార్యక్రమం ఘనంగా నిర్వహించే బాధ్యతను ఆయన పర్యవేక్షిస్తున్నారని! టాలీవుడ్ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారని మాత్రమే. అంటే రాజకీయాలంటేనే తనకేమీ పట్టకుండా.. ఏపీ వ్యవహారాలు అంటే.. తనకు పూర్తిగా అనవసరం అన్నట్లుగా మెగాస్టార్ డిసైడైపోయారా అని అభిమానులే అనుకుంటున్నారు.

పార్టీ స్థాపించినప్పటి ప్రకారం అయితే.. మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనేంత ఇమేజితోనే ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. పదవులు తనకు ప్రధానం కాదన్నారు. తీరా.. ఆ పార్టీ మంటగలిసిపోయింది. కనీసం తనను ఇంతటి వాడిని చేసిన ప్రజలకు తిరిగి ఏదో ఒకటి చేయాలని ఉన్నదంటూ ఆరోజు పలికిన మాటలన్నీ ఏమైపోయాయో తెలియదు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతోంటే ఆయన ఎందుకు మౌనం పాటిస్తున్నారో తెలియదు. రాజకీయాల గురించే ఇక నోరు మెదపకూడదని అనుకున్నారా? లేదా, మరో రకమైన వ్యూహంతో ఉన్నారా అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.