Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌కు చిరు గుడ్‌ బై!

By:  Tupaki Desk   |   16 Oct 2018 8:13 AM GMT
కాంగ్రెస్‌కు చిరు గుడ్‌ బై!
X
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల‌కు పూర్తిగా దూర‌మ‌వుతున్నారా? కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న గుడ్‌బై చెప్ప‌నున్నారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధాన‌మిస్తున్నాయి రాజ‌కీయ వర్గాలు. రాజ్య‌స‌భ ఎంపీగా ప‌ద‌వీకాలం ముగిస‌న‌ప్ప‌టి నుంచి రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న చిరు.. త్వ‌ర‌లో పూర్తిగా రాజ‌కీయాల నుంచి వైదొలుగుతార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వ కాల ప‌రిమితి ముగిస‌నప్ప‌టికీ.. దాన్ని మెగాస్టార్ పున‌రుద్ధ‌రించుకోలేదు. ఆయ‌న పార్టీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నార‌నేందుకు ఇదే సంకేత‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్ర‌జారాజ్యం పార్టీ స్థాప‌న‌తో 2008 లో ఉవ్వెత్తున రాజ‌కీయాల్లోకి దూసుకొచ్చిన చిరంజీవికి.. ఎన్నిక‌ల్లో మాత్రం ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సొంతంగా ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్యం కాక‌పోయినా.. ప్ర‌భుత్వ ఏర్పాటులో కింగ్ మేక‌ర్‌గా మారేంత స్థాయిలో 2009 ఎన్నిక‌ల్లో సీట్లు సాధించాల‌ని చిరు క‌ల‌లు క‌న్నారు. ఆయ‌న క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసింది.

అనంత‌రం అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌లో ప్ర‌జారాజ్యాన్ని చిరంజీవి విలీనం చేశారు. రాజ్య‌స‌భకు ఎంపీగా వెళ్లారు. కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రిగా స్వ‌తంత్ర హోదాలో ప‌నిచేశారు. 2014 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో భాజ‌పా అధికారంలోకి వ‌చ్చాక చిరు మంత్రి ప‌ద‌వి పోయింది. అదే ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ చావుదెబ్బ తిన‌డంతో.. ఇక అప్ప‌టి నుంచి మెగాస్టార్ క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. తిరిగి త‌న సొంత‌గూడు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశించారు. ఖైదీ నం.150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న సైరా సినిమాలో న‌టిస్తున్నారు. ఇక‌పై కూడా వ‌రుస‌బెట్టి సినిమాలు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. అందుకే రాజ‌కీయాల‌కు, కాంగ్రెస్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ స‌భ్య‌త్వ కాల‌ప‌రిమితి ముగిసినా చిరంజీవి దాన్ని పున‌రుద్ధ‌రించుకోక‌పోవ‌డం కూడా పార్టీకి ఆయ‌న వీడ్కోలు ప‌ల‌క‌నున్నార‌నే వార్త‌ల‌కు బ‌లాన్నిస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో తిరిగి రంగంలోకి దిగాల్సిందిగా చిరంజీవిని స్వ‌యంగా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కోరార‌ని.. అయినా చిరు స్పందించ‌లేద‌ని స‌మాచారం. దీంతో చిరు కాంగ్రెస్‌కు పూర్తిగా దూర‌మైన‌ట్లేన‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాక చిరు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌లో చేర‌తార‌న్న‌ది కొంద‌రి వాద‌న‌. అయితే, అదంత సులువు కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. చిరు రాజ‌కీయాల‌కు స‌రిపోడ‌నే అభిప్రాయం జ‌నాల్లో ఉంద‌ని.. కాబ‌ట్టి ఆయ‌న్ను చేర్చుకునేందుకు ప‌వ‌న్ కూడా పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోవ‌చ్చున‌ని వారు విశ్లేషిస్తున్నారు. పూర్తిగా సినిమాల‌కు స‌మ‌యం కేటాయించేందుకే ఆయ‌న కాంగ్రెస్ నుంచి త‌ప్పుకుంటున్నారు కావొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.