Begin typing your search above and press return to search.

శభాష్ మెగాస్టార్.. విశాఖ ఉద్యమానికి సపోర్టు! భారీ విరాళం ఇచ్చేస్తే బాగుండేది బాస్

By:  Tupaki Desk   |   11 March 2021 4:20 AM GMT
శభాష్ మెగాస్టార్.. విశాఖ ఉద్యమానికి సపోర్టు! భారీ విరాళం ఇచ్చేస్తే బాగుండేది బాస్
X
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ అప్పుడెప్పుడో మారుమోగిన నినాదాన్ని.. గడిచిన కొద్ది రోజులుగా విశాఖ వాసులు.. మీడియాతో పాటు మరికొందరు కూడా వినిపిస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయం కారణంగా విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కానుంది. దీనిపై ఏపీ సర్కారుతో పాటు విపక్షాలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా.. మోడీ సర్కారు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన నాటి నుంచి విశాఖలో పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఇష్యూ మీద అన్ని పార్టీలు కలిసి పోరాడని పరిస్థితి.

దశాబ్దాల నాటి విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదం ప్రజల మనసుల్లో ఉన్నా.. దాన్ని రగిలించి.. కేంద్రం కొమ్ముల్ని వంచే ఉద్యమ నాయకత్వం ఏపీకి లోపించింది. ఈ విషయంపై పలువురు నిరాశలో ఉన్నారు. ఓవైపు పర్వతం లాంటి మోడీని ఎదుర్కొనే ధైర్యాన్నిచేయలేకపోతున్నారు. కానీ..మోడీ కంటే కరకు నాయకురాలైన ఇందిరమ్మ నిర్ణయాన్ని మార్చేసిన ఘనత ఆంధ్రులిది. ఆ మూలాలుతమలో ఇంకానే ఉన్నాయన్న విషయాన్ని ఏపీ వాసులు మర్చిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. కాస్త లేట్ అయినా లేటెస్టుగా స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయన విశాఖ ఉక్కు ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అంటూ చేసిన నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయని.. విశాఖ ఉక్కును రక్షించుకోవటమే ఇప్పుడు ప్రధాన కర్తవ్యమని వ్యాఖ్యానించారు. పార్టీలకు.. ప్రాంతాలకు అతీతమైన.. న్యాయ సమ్మతమైన హక్కుగా అభివర్ణించారు.

దీన్ని కాపాడుకోవాలన్న అంశాన్ని ఉక్కు సంకల్పంతో కాపాడుకోవాలన్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న చిరు అనూహ్యంగా తన గళాన్ని విప్పారు. ఓవైపు ఈ అంశంపై అంత బలంగా గొంతు విప్పని జనసేన అధినేత పవన్ తీరుకు భిన్నంగా అన్న చిరు స్పందించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్నివెల్లడిస్తూ.. పార్టీలకు అతీతంగా ఈ ఇష్యూలో కదిలి రావాలన్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన నాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నట్లు పేర్కొన్నారు.

నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద విశాఖ ఉక్కుసాధిస్తామనే నినాదాన్ని రాసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ధర్నాలు..రిలే నిరాహార దీక్షలు.. హర్తాళ్లతో దీక్షలు చేశామన్నారు. దాదాపు 35 మంది పౌరులతో పాటు.. తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన నాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కునుకాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ పరిశ్రమలో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైన రోజున.. ప్రజలంతా పండుగ చేసుకున్నారని.. దేశంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. మెగాస్టార్ స్పందించిన తర్వాత అయినా.. సినీ పరిశ్రమలోనూ.. ఇతర రంగాలకు చెందిన వారు తమ మద్దతును ప్రకటించాల్సిన అవసరం ఉంది. తన మద్దతును మాత్రమే కాదు.. భారీ విరాళాన్ని చిరు ప్రకటిస్తే మరింత బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ మరేం చేస్తారో చూడాలి.