Begin typing your search above and press return to search.

తమ్ముడికి ‘చిరు’ షాక్.. కాంగ్రెస్ తోనే!?

By:  Tupaki Desk   |   30 July 2018 9:21 AM GMT
తమ్ముడికి ‘చిరు’ షాక్.. కాంగ్రెస్ తోనే!?
X
2019 ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. తమ అధినేత రాహుల్ గాంధీతోనూ - తనతోనూ చిరంజీవి మాట్లాడారని.. ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి మాట్లాడే హక్కు తనకు లేదని.. అంతా హైకమాండ్ చూసుకుంటుందని వివరించాడు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ తాము కలిసి పోటీచేయమని రఘువీరా స్పష్టం చేశారు. బీజేపీతో ప్రత్యక్షంగానో - పరోక్షంగానో సంబంధం పెట్టుకునే పార్టీలతో అయితే తాము కలిసేది లేదని తేల్చిచెప్పారు. పవన్ కళ్యాణ్ విషయంలో తమకు పూర్తి క్లారిటీ లేదని.. జనసేన గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదని తెలిపారు. మాజీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇవ్వడం ద్వారా బలం పెరిగిందని.. ఆయన ఆగస్టు1 నుంచి వివిధ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటారని రఘువీర చెప్పారు.

ఏపీలో కాంగ్రెస్ - బీజేపీ - టీడీపీ - వైసీపీ - పవన్ పార్టీలు బరిలోకి దిగితే .. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని రఘువీర కుండబద్దలు కొట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని తాము నిర్ణయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కింగ్ మేకర్ గా అవతరిస్తుందని రఘువీర ధీమా వ్యక్తం చేశారు.

కాగా కొద్దికాలంగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలపైన దృష్టిసారించారు. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కాంగ్రెస్ ను వదిలి జనసేన తరఫున ప్రచారం చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఈరోజు రఘువీరా క్లారిటీ ఇవ్వడంతో చిరంజీవి తన తమ్ముడికి ఎలాంటి సాయం చేయడం లేదని అర్థమైంది.