Begin typing your search above and press return to search.

రాజకీయ చర్చగా మారనున్న చిరు కల

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:31 AM GMT
రాజకీయ చర్చగా మారనున్న చిరు కల
X
హితులు.. సన్నిహితులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ.. కొన్ని విషయాల్ని ప్రస్తావించే ధైర్యం చేయరు. అందునా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసే విషయంలో వెనకాడుతుంటారు. అలాంటి వేళ.. వాటిని పట్టించుకోకుండా మనసులో ఉన్న మాటను ముఖం మీదనే చెప్పేయటం ఒక ఎత్తు అయితే.. అందరి ముందు ప్రస్తావించి.. కొత్త చర్చను తెర మీదకు తీసుకురావటం కొద్ది మంది చేస్తుంటారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి అలాంటి ప్రయత్నమే చేశారు.తాజాగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన.. విశిష్ఠ అతిధిగా అదే కార్యక్రమానికి హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడ్ని తాను రాష్ట్రపతిగా చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతులు ఉన్న వెంకయ్యనాయుడ్ని.. దేశ ప్రధమ పౌరుడిగా చూడాలన్న ఆకాంక్షను ఏ రాజకీయ ప్రముఖుడు ఇప్పటివరకు వెల్లడించింది లేదు.

బీజేపీ పాలసీ.. అందునా ప్రధాని మోడీ.. ఆయనకు నీడలా ఉండే అమిత్ షా వైఖరి తెలిసిందే కాబట్టి.. కమలనాథులు ఎవరూ కూడా వెంకయ్యను రాష్ట్రపతిగా చూడాలని మనసులో ఉన్నా బయటకు చెప్పే సాహసం చేయరు. ఇక.. ఇతర పార్టీల వారు వెంకయ్యతో సన్నిహిత సంబంధాలు ఎంత ఉన్నా.. తొందరపడలేమన్న రీతిలో ఉంటారు. ఇలాంటివేళ.. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి నోటి నుంచి వచ్చిన రాష్ట్రపతి కల మాటతో వెంకయ్యను దేశ అత్యున్నత స్థానంలో కూర్చోవాలన్న చర్చకు తెర తీశారని చెప్పాలి.

ఒకవేళ ఆ దిశగా అడుగులు పడితే మాత్రం.. చిరు మాటతోనే ఇది మొదలైందని చెప్పక తప్పదు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. వెంకయ్యను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించాలన్న ఆలోచన మోడీషాలకు లేదని చెబుతారు. ఒకవేళ జరిగితే.. తెలుగోడు దేశ అత్యున్న పదవిని చేపట్టటం చాలా ఆనందానికి గురి చేసే అంశం. అదే జరిగితే.. వెంకయ్య మెగాస్టార్ చిరంజీవిని కూడా మర్చిపోరని చెప్పక తప్పదు