Begin typing your search above and press return to search.

పవన్ వెనుకాల చిరునా? తిరుపతి ఉప ఎన్నిక కోసమేనా?

By:  Tupaki Desk   |   27 Jan 2021 2:30 PM GMT
పవన్ వెనుకాల చిరునా? తిరుపతి ఉప ఎన్నిక కోసమేనా?
X
రాజకీయాల్లో చేరి సీఎం అవుదామని ఎన్నో కలలుగన్న మెగాస్టార్ చిరంజీవి కుట్రలు కుతంత్రాలకు బలై పోయి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. మళ్లీ సినిమాల బాటపట్టేశారు. రాజకీయాల ప్రస్తావన తెస్తేనే దూరంగా జరుగుతున్నారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు జనసేన వెంట ఉన్నారని.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకోవడానికి చిరంజీవియే కారణమని.. జనసేన తరుఫున ఆయన ముందుకు వస్తారని జనసేన నంబర్ 2 నాయకుడు నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి..

విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ తెరపై ప్రతిధ్వనిస్తున్నాయి. ఏపీలో అస్సలు క్షేత్రస్థాయి క్యాడర్ లేని జనసేన ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే జనసైనికులకు ఉత్సాహం నింపేందుకు నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారా? లేక నిజంగానే పవన్ రాజకీయాల వెనుక చిరంజీవి ఉన్నారా? అన్నది ఆ ముగ్గురికే తెలియాలి.. ఎందుకంటే చిరంజీవికి రాజకీయాలంటేనే అసహ్యం పుట్టేసింది. ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్నారు.

అయితే పవన్ ను సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయమని సలహా ఇచ్చింది చిరంజీవియేనని నాదెండ్ల తెలిపారు. రాజకీయాల్లో పడి అప్పుల పాలై తమ్ముడు అధో:గతి పాలవకుండా అన్నయ్యగా ఆ మాట చెప్పి ఉంటాడని పలువురు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలంటే డబ్బులు అవసరం.. ఏం చేయకుండా నడపడం సాధ్యం కాదు. అందుకే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయమని చిరు చెప్పి ఉండొచ్చని.. అంతమాత్రాన జనసేన వెంట చిరు ఉన్నాడంటే ఎవ్వరూ అంగీకరించడం లేదని వారంటున్నారు.

జనసేనకు సొంతంగా ఏపీలో అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. ఎందుకంటే పవన్ సైతం 2019లో రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయాడు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా కార్యకర్తలు నేతల బలం లేదు. ఇక పొత్తు పెట్టుకున్న బీజేపీకి అంత సామర్థ్యం ఇప్పుడు లేదు. సో ఈ రెండు పార్టీలను నమ్ముకొని ఒకసారి దెబ్బతిన్న చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ వస్తాడనుకోవడం అత్యాశే. కేవలం జనసైనికుల్లో భరోసా నింపడానికి నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. లేదంటే నిజంగానే చిరంజీవి కనుక పవన్ కు.. జనసేనకు మద్దతిస్తే ఆయన ఇప్పటికే దీనిపై స్పందించేవారు కదా అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏది ఏమైనా పవన్ వెనుకాల చిరంజీవి ఉన్నారని.. జనసేన తరుఫున ఆయన ముందుకు వస్తారన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మేలా కనిపించడం లేదు. ఆ తరుణం వస్తుందో రాదో కూడా చెప్పడం కష్టంగానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.