Begin typing your search above and press return to search.

ఘోరం: మేయ‌ర్ భ‌ర్త కూడా చ‌నిపోయారు​ !!​

By:  Tupaki Desk   |   17 Nov 2015 5:17 PM GMT
ఘోరం: మేయ‌ర్ భ‌ర్త కూడా చ‌నిపోయారు​ !!​
X
చిత్తూరు జిల్లాలో ఈ రోజు మ‌ధ్యాహ్నం జ‌రిగిన దండుగుల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మేయ‌ర్ భ‌ర్త క‌ఠారి మోహ‌న్ కూడా మృతిచెందారు. ఈ రోజు జ‌రిగిన దాడిలో మేయ‌ర్ అనూరాధ అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా ఆమె భ‌ర్త‌పై క‌త్తుల‌తో దాడి చేయ‌డంతో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మోహ‌న్‌ను ముందుగా చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి అక్క‌డ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం రాయ‌వెల్లూరు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ రాత్రి స‌మ‌యంలో మృతిచెందారు.

ప్ర‌త్య‌క్ష సాక్షులు చెపుతున్న క‌థ‌నం ప్ర‌కారం క‌ర్ణాట‌క రిజిస్ర్టేష‌న్ వాహ‌నంలో వ‌చ్చిన ఆరుగురు దండుగులు బొకేల‌తో కార్పొరేష‌న్‌లోని మేయ‌ర్ కార్యాల‌యంలోకి వెళ్లారు. ఆ స‌మయంలో అనూరాధ భ‌ర్త మోహ‌న్‌తో పాటు ఎనిమిది మంది కార్పొరేట‌ర్లు కూడా మేయ‌ర్ హాలులోనే ఉన్నారు. గ్రీవెన్స్ డే కావ‌డంతో మేయ‌ర్‌కు విన‌తులు ఇచ్చేందుకు వ‌స్తున్నార‌నుకున్న కార్పొరేష‌న్ సిబ్బంది వారి గురించి ప‌ట్టించుకోలేదు. అలాగే బుర‌ఖాలు ధ‌రించి బొకేల‌తో రావ‌డంతో దండుగుల‌ను ఎవ్వ‌రు గుర్తు ప‌ట్ట‌లేదు స‌రిక‌దా వారు మ‌హిళ‌లుగా భావించారు.

మేయ‌ర్ కార్యాల‌యంలోకి వెళ్లిన దండుగుల‌ను చూసిన మేయ‌ర్ వారు విన‌తులు ఇస్తార‌నుకుని వాటిని స్వీక‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా దండుగులు ఒక్క‌సారిగా ఆమెపై కాల్పులు జ‌రిపారు. మేయ‌ర్ త‌ల‌పై అతి సమీపం నుంచే కాల్పులు జ‌ర‌ప‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయారు. త‌ర్వాత కౌన్సెల్ హాలులోనే ఉన్న మేయ‌ర్ భ‌ర్త మోహ‌న్‌పై క‌త్తుల‌తో విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేశారు. మోహ‌న్ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ముందుగా ఆయ‌న్ను చిత్తూరు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి...అక్క‌డ నుంచి రాయ‌వెల్లూరు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అక్క‌డ చికిత్స పొందుతూ ఆయ‌న మృతి చెందారు.

ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ముగ్గురు వ్యక్తులు చిత్తూరు హ‌త్య జ‌రిగిన వెంట‌నే చిత్తూరు ఒక‌టో ప‌ట్ట‌ణ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయారు. ఇదిలా ఉంటే ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా భావిస్తున్న మోహన్ అక్క కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూకు చెందిన ఆఫీసును మోహన్ వర్గీయులు పెట్రోలు పోసి నిప్పంటించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంటలార్పుతున్నారు.