Begin typing your search above and press return to search.

పులివ‌ర్తి!... నారాకు దెబ్బేస్తున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   17 Feb 2019 12:44 PM GMT
పులివ‌ర్తి!... నారాకు దెబ్బేస్తున్నార‌ట‌!
X
చంద్ర‌గిరి అసెంబ్లీ... చిత్తూరు జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్రంలోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌దే. ఎందుకో తెలుసు క‌దా. టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంతూరు ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంది. అంతేనా చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచే ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ మ‌రుక్ష‌ణ‌మే ఆయ‌నను అక్క‌డి ప్ర‌జ‌లు తిర‌స్క‌రించేశారు. సొంతూరి వారి దెబ్బకు బెంబేలెత్తిపోయిన చంద్ర‌బాబు... త‌న సొంత జిల్లాలోనే అలా ఓ మూల‌కు విసిరేసిన‌ట్టుగా ఉన్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి పారిపోయార‌ని విప‌క్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. చంద్ర‌బాబు ఎగ్జిట్ తో చాలా కాలం నుంచి ఇక్క‌డ టీడీపీకి విజ‌యం క‌ల‌గానే మారిపోయింది. లాస్ట్ ఎల‌క్ష‌న్స్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన మాజీ మంత్రి గ‌ల్లా అరుణ కుమారి పోటీ చేసినా విజ‌యం సాధించ‌లేక‌పోయారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా ఇక్క‌డి నుంచి పోటీ చేసి చంద్ర‌బాబుకు గ‌ట్టి దెబ్బ‌ను కొట్టేసిన చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కే ఎడ్జ్ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే తాను ఎలాగూ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో గెల‌వ‌లేక‌పోయాను... మీరైనా గెలిచి మ‌న స‌త్తా చాటండి అంటూ ఇప్పుడు చంద్ర‌బాబు... త‌న పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేస్తున్న వైనం నిజంగానే ఆస‌క్తిక‌ర‌మే. ఈ క్ర‌మంలో గ‌ల్లా కూడా ఈ ద‌ఫా తాను పోటీ చేయ‌లేన‌ని, ఇంకెవ‌రినైనా చూసుకోండ‌ని చంద్ర‌బాబుకు ముఖం మీదే చెప్పేశార‌ట‌. దీంతో ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి సారించిన చంద్ర‌బాబు... చిత్తూరు జిల్లా టీడీపీ ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ను చేప‌ట్టిన త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన పులివ‌ర్తి నానిని చంద్ర‌గిరి ఇంచార్జీగా నియ‌మించారు. ఈ సారి ఎలాగైనా చంద్ర‌గిరిని గెలిచి తీరాల్సిందేన‌ని నానికి చంద్ర‌బాబు టార్గెట్ పెట్టేశార‌ట‌. అయితే నాని మాత్రం త‌న‌దైన వ్య‌వ‌హారంతో ముందుకు సాగుతూ బాబు క‌ల‌కు గండి కొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌.

చంద్ర‌గిరిలో ఇప్పుడు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చాలానే మారిపోయాయి. సింగిల్ టైమ్ ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ చెవిరెడ్డి అక్క‌డ బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు. వ‌చ్చే ఎన్నికల్లో చెవిరెడ్డిని ఓడించాలంటే అంత ఈజీ కాదు. చెవిరెడ్డిని ఢీకొట్టాలంటే... ఇటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు గల్లా ఆరుణ‌తో పాటు పార్టీలో చేరిన కాంగ్రెస్ వ‌ర్గాన్ని కూడా క‌లుపుకుని పోవాల్సి ఉంది. అయితే నాని ఇందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. గ‌తంలో కాంగ్రెస్ లో ఉన్న స‌మ‌యంలో త‌మ‌ను ఇబ్బందులు పెట్టార‌న్న క‌క్ష‌ల‌తో ర‌గిలిపోతున్న నాని... కాంగ్రెస్ నేప‌థ్యం ఉన్న కార్య‌క‌ర్త‌ల‌ను అస‌లు ద‌గ్గ‌ర‌కే రానివ్వ‌డం లేదట‌. అస‌లు టీడీపీకి అక్క‌డ పెద్ద‌గా బ‌ల‌మే లేని నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల‌ను స్వ‌యంగా పిలుచుకుని మ‌రి క‌లిసిపోవాల్సిన నాని... అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటే... ఈ సారి కూడా చంద్ర‌గిరిలో బాబు క‌ల... క‌ల‌గానే మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌న్న మాట‌.