Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో మార్పు..జగన్ సీఎం కావాలి..

By:  Tupaki Desk   |   9 July 2018 8:40 AM GMT
సినీ ఇండస్ట్రీలో మార్పు..జగన్ సీఎం కావాలి..
X
తెలుగుదేశం పార్టీ పుట్టుకకు సినీ నేపథ్యానికి దగ్గరి సంబంధాలున్నాయి. తెలుగు సినిమా తెరపై వెలుగు వెలిగిన సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల్లోనే అధికారం చేపట్టారు. కానీ ఆ తర్వాత టీడీపీని నిజమైన పొలిటికల్ నేత చంద్రబాబు హైజాక్ చేశారు. ఇప్పటికీ అన్నగారిపై అభిమానంతో సినిమా ఇండస్ట్రీలోని ముఖ్యలు టీడీపీలో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు అదే బాబు వారికి చేదు అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు జగన్ వెంట నడుస్తోంది. పోసాని - కమెడియన్ పృథ్వీ సహా ఎంతో మంది జగన్ పాదయాత్ర వద్దకు వచ్చి ఆయనతో కలిసి నడిచారు. ఇప్పుడు మరో ప్రముఖుడు సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు కూడా జగన్ ను కలిశారు.

జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆయనను పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న యాత్రలో జగన్ తో కలిసి కాసేపు నడిచారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడారు. ఏపీలో సుపరిపాలన కావాలంటే జగన్ సీఎం కావాలని స్పష్టం చేశారు.

ఒకరూ.. ఇద్దరూ కాదు.. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. టీడీపీని కాదంటూ వైసీపీకి మరులుతున్నారు. వైఎస్ జగన్ లోని నిజాయితీకి ఫిదా అవుతున్నారు. ప్రజల కోసం వందల కి.మీల పాదయాత్ర చేస్తున్న ఆయన పట్టుదలకు గులాం చేస్తున్నారు. అందరి కష్టాలు తీర్చే నాయకుడు జగన్ అంటూ కొనియాడుతున్నారు.

సినిమా పరిశ్రమలో వచ్చిన ఈ మార్పు వచ్చే 2019 ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లు సినీ గ్లామర్ ను పట్టుకొని నెట్టుకొచ్చిన టీడీపీకి వారి నిర్ణయం శరాఘాతంగా మారబోతోంది. వైసీపీ తరఫున పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేసేందుకు సై అంటున్నారు. దీంతో ప్రజల్లో కూడా వైసీపీకి మరింత మైలేజ్ రానుంది. సినీ ప్రముఖుల ప్రచారంతో అభ్యర్థుల విజయావకాశాలు పెరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఈ కొత్త మార్పు వైసీపీకి కొండంత బలాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.