Begin typing your search above and press return to search.

క్రిస్ కెయిన్స్.. ఫిక్సింగ్ లో ఆల్ రౌండర్

By:  Tupaki Desk   |   16 Oct 2015 7:45 AM GMT
క్రిస్ కెయిన్స్.. ఫిక్సింగ్ లో ఆల్ రౌండర్
X
మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలు రోజుకొకటి గుప్పుమంటున్నాయి. వీటన్నటికీ ఇండియాతోనే లింకులుండడం విశేషం. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ దీనికి సంబంధించి ఆ దేశ మాజీ ఆటగాడిపై ఆరోపణలు చేశారు. న్యూజిలాండు జట్టులో తన మాజీ సహచరుడు క్రిస్ కెయిన్స్ తనను మ్యాచ్ ఫిక్సింగు చేయమని కోరాడని మెక్ కలమ్ ఆరోపించాడు. ఏడేళ్ల కిందట కోల్ కతాలోని ఓ హోటళ్లో ఇదంతా జరిగిందని మెక్ కలమ్ చెబుతున్నాడు.

ఐపీఎల్ 2008 సీజన్ లో భాగంగా ఆ ఏడాది ఏప్రిల్ లో కోల్ కతా లోని ఓ హోటల్ లో కెయిన్సు మెక్ కలమ్ ను కలిసి ఫిక్సింగ్ లోకి దించేందుకు ట్రై చేశాడట. అయితే అతడి ప్రతిపాదనకు తాను నో చెప్పానని మెక్ కలమ్ లండన్ కోర్టులో వెల్లడించాడు. కెయిన్స్ తనకు ఆ మాట చెప్పగానే తాను షాకయ్యానని.. కెయిన్సు ఆ తరువాత కూడా తనను రెండు సార్లు కలిసి ఫిక్సింగు చేయమని కోరాడని మెక్ కలమ్ కోర్టుకు చెప్పాడు. ఫిక్సింగు ఎలా చేయాలి.. ఏం చేయాలి అంతా తనకు ఓ పేపర్ పై రాసిచ్చి మరీ వివరించాడని చెప్పాడు. స్పాట్ ఫిక్సింగ్ కు ఓకే అంటే ఒక్కోదానికి 70 వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశ పెట్టాడని వెల్లడించాడు. కెయిన్స్ ఇలాగే ఫిక్సింగ్ చేసి సంపాదించిన డబ్బుతో న్యూజిలాండులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడన్నది మెక్ కలమ్ మరో ఆరోపణ. కెయిన్స్ పై 2011లోనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మెక్ కల్లమ్ చెబుతున్నాడు.

కాగా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆల్ రౌండర్ గా పేరున్న కెయిన్స్ పేరు గతంలోనూ ఫిక్సింగు వ్యవహారాల్లో వినిపించింది. ఆ కేసులు కొన్ని ఇప్పటికీ నడుస్తున్నాయి. అందులో భాగంగానే లండన్ కోర్టులో జరుగుతున్న విచారణలో మెక్ కలమ్ కెయిన్స్ కు సంబంధించిన సంగతులన్నీ కోర్టుకు చెప్పాడు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.