Begin typing your search above and press return to search.

విధ్వంసక గేల్ లో మరో కోణం

By:  Tupaki Desk   |   24 May 2016 4:56 AM GMT
విధ్వంసక గేల్ లో మరో కోణం
X
ఆత్మకథల్ని ఆచితూచి రాయటం ఒకప్పటి యవ్వారం. ఆవతలోళ్లని టార్గెట్ చేయకుండా ఆచితూచి జీవిత కథల్ని చెప్పే కాలం పోయి చాలాకాలమైంది. ఎన్ని సంచలనాలు ఉంటే అంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఆత్మకథల్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవటం ఒక వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో వీలైనన్ని ‘‘నిజాల్ని’’ ప్రస్తావించటం ద్వారా భారీ క్రేజ్ ను పెంచుకోవాలన్న ఐడియా ఇప్పుడు చాలామంది ప్రముఖుల్లో కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే వారి ఆత్మకథలు ఆవిష్కృతమవుతున్నాయి. విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఆత్మకథ కూడా ఈ తరహాలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.

తన మీద విమర్శలు చేసే వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా మాటల పంచ్ లు వేసినట్లుగా చెబుతున్నారు. ఇతగాడి ఆత్మకథలోని కొన్ని అంశాలు బయటకొచ్చి సంచలనంగా మారుతున్నాయి. తన వ్యవహారశైలితో పలుమార్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గేల్.. తనను వేలెత్తి చూపించే వాళ్లను దుమ్మెత్తి పోయటమే కాదు.. వారిక నోరు విప్పకుండా ఉండేలా ఘాటైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

ఆ మధ్యన మ్యాచ్ అనంతరం తనను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ను ఉద్దేశించి.. నీతో షికారు కోసమే ఇంతలా ఆడా అంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపోయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గేల్ వ్యాఖ్యలపై పలువురు సీనియర్ క్రికెటర్లు మండిపడ్డారు. అంతేకాదు.. ఈ వ్యవహారంలో గేల్ కు 10వేల డాలర్ల జరిమానాను విధించారు కూడా.

తన మాటల మీద జరిగిన రచ్చ మీద గేల్ తన ఆత్మకథలో భారీగానే కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తన ఆత్మకథ ఎంత సంచలనంగా మారుతుందన్న విషయాన్ని తాజాగా తన మాటల టీజర్ తో ఆసక్తిని ఆమాంతంగా పెంచేశాడని చెప్పాలి. తన ఆత్మకథ పుస్తకం గురించి మాట్లాడిన గేల్.. తనను విమర్శించే వారి మీద తీవ్రస్థాయిలో మండిపడటమే కాదు.. నిత్యం నీతులు చెప్పే క్రికెట్ పెద్దల చీకటి కోణాల్ని ప్రస్తావించటం గమనార్హం.

ఒకప్పటికి టెస్ట్ ఫార్మాట్ నుంచి టీ20 ఫార్మాట్ కు వచ్చేశామని.. ఇప్పుడేదైనా భిన్నంగా చేయాల్సి ఉందని.. తాను సరదాగా జోక్ చేసిన మాటల్ని వివాదం చేయటం.. క్రికెట్ ను అగౌరవపరుస్తున్నానంటూ విమర్శలు చేస్తున్న వారికి సంబంధించిన కొన్ని అంశాల్ని ప్రస్తావించటం ఇప్పుడు పెను దుమారంగా మారింది. ‘‘మ్యాచ్ ల మధ్యలో వయాగ్రా వాడే ఫ్లింటాప్ నాకు పాఠాలు చెప్పటం ఏంటి? అతను ఎప్పుడైనా షార్ట్ బంతి వేస్తే అది బ్యాక్ వర్డ్ పాయింట్లో బౌండరీగా తేలేది. అతనో పిల్లోడు’’ అంటూ పంచ్ విసిరిన గేల్.. క్రికెట్ పెద్దమనుషుల్లో ఒకరిగా చెప్పుకునే ఇయాన్ చాపెల్ ను విడిచిపెట్టలేదు.

‘‘వెస్టిండీస్ క్రికెట్ ఆడుతూ ఓ అధికారిని కొట్టి దోషిగా తేలిన ఇయాన్ చాపెల్ నన్ను క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తాడా? అతను మొత్తం క్రికెట్ నే బ్యాన్ చేయాలని కూడా అనగలడు’’ అంటూ విరుచుకుపడ్డాడు. తన ఆత్మకథకు సంబంధించిన నాలుగు మాటలు చెప్పే సదర్భంలోనే వ్యవహారాన్ని ఇంత సంచలనంగా మార్చిన గేల్.. తనపై విమర్శలు చేసే వారి మీద తన ఆత్మకథలో మరింత చెలరేగిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.