Begin typing your search above and press return to search.

టీ20ల్లో క్రిస్ గేల్ సంచలన రికార్డ్ .. ఇంకెఎవ్వరికీ సాధ్యం కాదేమో..

By:  Tupaki Desk   |   13 July 2021 10:40 AM GMT
టీ20ల్లో క్రిస్ గేల్ సంచలన రికార్డ్ .. ఇంకెఎవ్వరికీ సాధ్యం కాదేమో..
X
క్రిస్ గేల్ .. యూనివర్సల్ బాస్. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకున్నాడు అంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులే ఫీల్డర్లు గా మారిపోతారు. గ్రౌండ్ లో ప్రత్యర్థులు మ్యాచ్ ను చూసే వీక్షకులుగా మారతారు. బౌల‌ర్ ను ఊత‌కోచ కోస్తూ ప‌రుగులు రాబ‌ట్టంలో త‌న‌దో ప్ర‌త్యేక స్టైల్. అందుకే ధ‌నాధ‌న్ క్రికెట్ లో గేల్ పేరు మార్మోగుతుంది. వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు, స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తన సత్తా ఏంటో మరోసారి అందరికి నిరూపించుకున్నాడు. తానెందుకు యూనివర్సల్ బాస్ అయ్యాడో మరో మైలురాయితో చెప్పకనే చెప్పేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీని ద్వారా టీ20ల్లో ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైన క్రికెటర్‌ గా ఈ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ నిలిచాడు.

ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గేల్ ఈ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అది కూడా త‌న‌దైన స్టైల్లో ఓ సిక్స్‌ తో ఈ 14 వేల మైల్‌ స్టోన్‌ ను అందుకున్నాడు. గేల్ ఇప్ప‌టి వ‌ర‌కూ 431 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గేల్ త‌ర్వాత మ‌రో వెస్టిండీస్ బ్యాట్స్‌ మ‌న్ కిరణ్ పొలార్డ్ 545 మ్యాచ్‌లు ఆడి 10836 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 142 ప‌రుగుల ల‌క్ష్యంతో దిగిన విండీస్‌.. గేల్ హాఫ్ సెంచ‌రీతో ఈ మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే 3-0తో గెలుచుకుంది. కేవ‌లం 38 బంతుల్లోనే 67 ప‌రుగులు చేసిన గేల్‌.. 7 సిక్స‌ర్లు, 4 ఫోర్లు బాదాడు. దీంతో విండీస్ కేవ‌లం 14.5 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ చేజ్ చేసింది.

డారెన్ సమీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 141 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలో 14,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఐ యామ్ బ్యాక్ అంటూ వెస్టిండీస్ అభిమానులకు మంచి ఇన్నింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. త్వరలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ ముందు అన్ని దేశాలకి క్రిస్ గేల్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని ముందే హెచ్చరించాడు. మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. బ్యాట్‌తో సత్తా చాటడానికి చాలా కష్టపడ్డాను. చాలా రోజుల తరువాత కీలక ఇన్నింగ్స్ ఆడటం సంతోషంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ టీ20 సిరీస్ విజయం సాధించడం పట్ల గేల్ హర్షం వ్యక్తం చేశాడు. విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ ను తన వంతు సహకారం అందించాలని భావించినట్లు గేల్ తెలిపాడు. గొప్ప ప్రత్యర్థిపై తమకు అద్భుతమైన సిరీస్ అని వ్యాఖ్యానించాడు.

యూనివర్స్ కింగ్ క్రిస్ గేల్ ప్రపంచంలో జరిగే ప్రతీ టీ20 లీగ్‌ లోనూ కనిపిస్తాడు. ప్రతి టోర్నీలోనూ సిక్స్‌ ల వర్షం కురిపిస్తూ.. ఎక్కువ సంఖ్యలో సిక్స్‌లు బాదాడు. ఇంకెవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు. టీ20 క్రికెట్‌ లో క్రిస్ గేల్ ఇప్పటి వరకు 1000 సిక్స్‌లకి పైగా బాదాడు. వెయ్యికి పైగా సిక్స్‌లు కొట్టిన ఏకైక క్రికెటర్ క్రిస్ గేల్ మాత్రమే. మరెవరూ ఇతడి దరిదాపుల్లో కూడా లేరు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున క్రిస్ గేల్ 263 సిక్స్‌లు కొట్టాడు. ఒక జట్టు తరపున ఇన్ని సిక్స్‌ లు కొట్టడం ఓ రికార్డు.

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుపై క్రిస్ గేల్ 61 సిక్స్‌లు కొట్టాడు. ఒక జట్టుపై ఎక్కువ సంఖ్యలో సిక్స్‌ లు బాదిన ఘనత క్రిస్ గేల్‌ కే దక్కుతుంది. 2018నుంచి KIXP తరపున ఆడుతున్నాడు. ఆ జట్టులో ఆడుతూ ఇప్పటి వరకు 84 సిక్స్‌ లు బాదాడు. క్రిస్ గేల్ 2015లో ఏకంగా 135 సిక్స్‌లు కొట్టాడు. ఒక ఏడాదిలో ఇంకెవరూ ఇన్ని సిక్స్‌లు సాధించలేదు. ఒక టీ20 మ్యాచ్‌లో అత్యధికంగా 18 సిక్స్‌ లు కొట్టిన ఘనత కూడా గేల్ దే. 2015 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ లో ఈ ఫీట్ సాధించాడు. డ్వేన్ బ్రావో బౌలింగ్‌లోనే అత్యధిక సిక్స్‌లు కొట్టాడు క్రిస్ గేల్. అతడి బౌలింగ్‌లో ఏకంగా 17 సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్ ఇప్పటి వరకు 18 సార్లు ఒక మ్యాచ్‌లో 10 కంటే ఎక్కువ సిక్స్‌లు కొట్టాడు. ఇంకే బ్యాట్స్‌మెన్ కూడా మూడు కంటే ఎక్కువ సార్లు 10 సిక్స్‌లు కొట్టలేదు.