Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గుడికి వెళితే అంత గోలా?

By:  Tupaki Desk   |   11 Nov 2017 4:29 AM GMT
జ‌గ‌న్ గుడికి వెళితే అంత గోలా?
X
సెంటిమెంట్ పేరుతో చేసే రాజ‌కీయం చాలా ప్ర‌మాద‌క‌రం. ఒక ప్ర‌యోజ‌నాన్ని ఆశించి చేసే ప‌నులు కాల‌క్ర‌మంలో అడ్డంకిగా మారి.. ఎవ‌రైతే ఇలాంటివి మొద‌లెడ‌తారో వారి మెడ‌కే చుట్టుకుంటాయి. తాజాగా ఏపీలో సాగుతున్న ఒక ఉదంతాన్ని చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నేప‌థ్యంలో.. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌టం తెలిసిందే. దీనిపై తాజాగా క్రైస్త‌వ సంఘాల పేరిట కొంద‌రు త‌ప్పు ప‌ట్ట‌టం విచిత్రంగా మారింద‌ని చెప్పాలి. క్రైస్త‌వుడై ఉండి తిరుమ‌లేసుడిని పూజించ‌టం త‌ప్పు అని.. పాప‌మ‌ని.. జీసెస్ క్ష‌మించ‌డంటూ కెమేరాల ముందు ఆగ‌మాగం చేస్తున్న వారిని చూస్తే అయ్యో అనుకోకుండా ఉండ‌లేం.

ఏ మతం కూడా నా మ‌తాన్ని మాత్ర‌మే ఆచ‌రించు.. ఆ క్ర‌మంలో అవ‌త‌లోడి మ‌తం వైపు క‌న్నెత్తి చేసినా క‌ళ్లు పోతాయ్‌.. ట‌న్నుల ట‌న్నుల పాపం మూట క‌ట్టుకుంటావ‌ని చెప్ప‌లేదు. అన్ని మ‌తాలు ప‌ర‌మ‌త స‌హ‌నాన్నే కాంక్షించాయే త‌ప్పించి.. మ‌రో మాట‌ను చెప్ప‌లేదు.

హిందువు కేవ‌లం గుళ్లకు మాత్ర‌మే వెళ్లాలా? ఒక‌వేళ‌.. చ‌ర్చికి కానీ మ‌సీదుకు కానీ వెళితే.. పాపం మూట‌లు వారి నెత్తి మీద ప‌డిపోతాయా? అన్న‌ది ప్ర‌శ్న‌. అలా అని ఎక్క‌డా చెప్ప‌లేదు. అలాంటిదే ఒక ముస్లిం కానీ క్రైస్త‌వుడు కానీ అన్య మ‌తాల‌కు చెందిన ప్రార్థ‌నాల‌యాల‌కు వెళ్ల‌టం చూస్తున్నాం. ఎక్క‌డిదాకానో ఎందుకు తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా ఒక ద‌ర్గాకు వెళ్లి త‌న మొక్కును తీర్చుకోలేదా?

ఆయ‌న ఎంత హిందుత్వవాదో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డ‌.. హిందుత్వ అన‌గానే మ‌రేదో ఊహించుకోవ‌ద్దు. యాగాలు చేయ‌టం.. స్వాముల సూచ‌న‌ల్ని ప‌క్కా పాటించ‌టం.. గుడుల‌కు వెళ్ల‌టం లాంటివి చేయ‌టంలో కేసీఆర్ దగ్గ‌ర‌కు చుట్టుప‌క్క‌ల ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రార‌ని చెప్పాలి. మ‌రి.. అలాంటి పెద్ద‌మ‌నిషి ద‌ర్గాకు వెళ్లి భారీ మొక్కును తీర్చుకోవ‌టాన్ని ఏదైనా హిందూ సంస్థ ఖండించి.. ఇలాంటి ప‌ని చేస్తావా? ఎంత దుర్మార్గం అని ఏ స్వామీజీనో.. మ‌రెవ‌రైనా చెబితే ఎలా ఉంటుంది?

ఇంచుమించు జ‌గ‌న్ ఎపిసోడ్ కూడా ఇప్పుడు అలానే ఉంది. ఎవ‌రో కొంద‌రు ఏదో చెబితే.. దానికి మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం ఇవ్వ‌టం చూస్తే.. అది ప‌ర‌మ‌త స‌హ‌నానికి తూట్లు పొడ‌వ‌టంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక ధ‌ర్మాన్ని ఆచ‌రించే వ్య‌క్తి ఆ ధ‌ర్మంలోనే ఉండాలే త‌ప్పించి.. మ‌రో ధ‌ర్మంపై సానుకూల‌త ప్ర‌ద‌ర్శించినా త‌ప్పే అన్న ధోర‌ణి ఏ మాత్రం స‌రికాదు. ఇలాంటి వాటిని నిరుత్సాప‌ర్చాల్సింది పోయి.. ప్ర‌చారాన్ని క‌ల్పించ‌టం త‌ప్పే అవుతుంది. రాజ‌కీయ స్వార్థం కోసం చేసే ఇలాంటి ప‌నులు అంతిమంగా కొత్త స‌మ‌స్య‌లు తెర మీద‌కు తెస్తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అలాంటివి చేసే వారు తొలుత లాభ‌ప‌డినా.. అంతిమంగా న‌ష్ట‌పోతార‌న్నది నిజం.