Begin typing your search above and press return to search.

వైసీపీ మహిళా కౌన్సిలర్ ను ఆ సీఐ వేధిస్తున్నాడట!

By:  Tupaki Desk   |   11 Jan 2022 5:30 AM GMT
వైసీపీ మహిళా కౌన్సిలర్ ను ఆ సీఐ వేధిస్తున్నాడట!
X
ఏపీ అధికార పక్షానికి చెందిన మహిళా కౌన్సిలర్ ఒకరు చేసిన వీడియో ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక సీఐ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొంటూ వైసీపీ కౌన్సిలర్ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన మహిళా నేతపై పోలీసు అధికారి ఇలా వ్యవహరించటమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాను ఎదుర్కొంటున్న వేధింపులపై తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి తమను కాపాడాలని కోరుకోవటం గమనార్హం. అసలేం జరిగిందంటే..

ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ఐదో వార్డు కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు సూరగాని లక్ష్మి. ఆమె ఏపీ అధికార పార్టీకి చెందిన సభ్యురాలు. ఆమె భర్త నరసింహారావుకు చీరాలలో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. డిసెంబరు 31 రాత్రి 11.20 గంటలకు చీరాల వన్ టౌన్ సీఐ రాజమోహన్ సిబ్బందితో సహా రెస్టారెంట్ కి వచ్చి.. తన భర్తను దుర్బాషలాడినట్లుగా ఆమె ఆరోపించారు.

తమ వద్ద పని చేసే సిబ్బందిని కొట్టటంతో పాటు.. తన భర్తను స్టేషన్ కు తీసుకెళ్లి బూతులు తిట్టినట్లుగా ఆమె పేర్కొన్నారు. సీఐ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్న కోపంతో ఈ నెల 8 రాత్రి మరోసారి సిబ్బందితో రెస్టారెంట్ కు వచ్చిన సీఐ.. వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని బెదిరించారన్నారు. అక్కడున్న వారిని తరిమి కొట్టినట్లుగా ఆమె ఆరోపించారు.

ఒకవైపు స్థానిక వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయిన వేళ.. తాజాగా ఒక కౌన్సిలర్ సతీమణి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోపై స్పందించిన సీఐ.. తాను దాడిచేయలేదని.. తిట్టింది కూడా లేదని.. ఈ నెల 8న తాను బార్ వద్దకు వెళ్లింది లేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను ఆదుకోవాలంటూ మహిళా కౌన్సిలర్ చేసిన వినతికి సీఎం ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.