Begin typing your search above and press return to search.

అవినాష్ రెడ్డి ఎంతో ఒత్తిడి తెచ్చారు కానీ.. లొంగలేదు.. వాంగ్మూలంలో సీఐ శంకరయ్య

By:  Tupaki Desk   |   24 Feb 2022 3:58 AM GMT
అవినాష్ రెడ్డి ఎంతో ఒత్తిడి తెచ్చారు కానీ.. లొంగలేదు.. వాంగ్మూలంలో సీఐ శంకరయ్య
X
దివంగత మహానేత వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని పులివెందులలోని ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేసిన ఉదంతం తెలిసిందే. దీనికి సంబంధించి ఇంతవరకు బయటకు రాని అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య వాంగ్మూలం తాజాగా వెలుగు చూడటం.. సీబీఐ విచారణకు హాజరైన సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు పెను సంచలనంగానే కాదు.. ఈ అంశంపై సరికొత్త సందేహాలకు తెర తీసేలా మారాయి.

అదే సమయంలో.. హత్య వేళలో జరిగిన పరిణామాల్ని ఆయన పూసగుచ్చినట్లుగా తన వాంగ్మూలంలో వెల్లడించటం కనిపిస్తుంది.

వైఎస్ వివేకా హత్య కేసు ఇష్యూలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తెచ్చినట్లుగా సీఐ శంకరయ్య తెలపటంతో పాటు.. మరికొందరి పేర్లు కూడా వెల్లడించారు. సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎంపీ అవినాష్ తో పాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డి కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డి అత్యంత సన్నిహితుడని.. ఎర్ర గంగిరెడ్డి వివేక వద్ద పీఎస్ గా పని చేశారన్నారు. వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసన్నారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇంకేం చెప్పారంటే..

- కడప ఎంపీ అవినాష్ రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అత్యంత సన్నిహితులు. డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షుడు. అవినాష్ కార్యక్రమాలన్నీ ఆయనే నిర్వహిస్తుంటారు. ఆయన ప్రచారంతో పాటు.. బహిరంగ సభల్లోనూ పాల్గొంటారు. పులివెందుల.. లింగాల.. సింహాద్రిపురం.. వేముల పోలీస్ స్టేషన్లలో శివశంకర్ రెడ్డిపై 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.

- హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి వెళ్లేసరికి శివశంకర్ రెడ్డి అక్కడే ఉన్నారు. అంత్యక్రియల కోసం మ్రతదేహాన్ని తరలించేందుకు వీలుగా ఎర్ర గంగిరెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫ్రీజర్ ను వివేకా ఇంట్లోకి తెప్పించారు. అందులోకి తరలించకుండా అడ్డుకున్నారు.

- వీరిద్దరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా కనిపించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పాటు ఘటనా స్థలంలో ఉన్న భారీ భారీ జన సమూహంలో వివేకా డెడ్ బాడీపై ఉన్న గాయాలకు బ్యాండేజీలు.. కట్లు కడుతున్న వారిని నియంత్రించలేకపోయా.

- శాంతి భద్రతల సమస్య తలెత్తుందున్న భయంతోనే తొలుత హత్యా నేరాన్ని నమోదు చేయలేదు. కేసు లేకుండానే వివేకా అంత్యక్రియలు నిర్వహించేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారు.