Begin typing your search above and press return to search.

రైతు రుణాలకి సిబిల్ అర్హతని వెంటనే తొలగించండి

By:  Tupaki Desk   |   28 Nov 2019 10:50 AM GMT
రైతు రుణాలకి సిబిల్ అర్హతని వెంటనే తొలగించండి
X
మనదేశానికి ఆయువు పట్టు అయిన రైతులపై కేంద్రం కొన్ని రోజుల ముందు ఒక కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రైతులు పంటల పెట్టుబడి కోసం తీసుకునే రుణాలని సిబిల్ ఆధారంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ కారణంగా చాలామంది రైతులు సకాలంలో రుణాలు పొందలేకపోతున్నారని దీనిపై మరోసారి పునరాలోచించాలి అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభ జీరో అవర్‌ లో ఎంపీ మాట్లాడుతూ..వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి రైతులకు సకాలంలో రుణం లభించడం ఎంతో ముఖ్యం అని , రైతులకు రుణాలు మంజూరీ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ లు ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషిస్తుంటాయి. అయితే వ్యవసాయ రుణాల మంజూరీకి సంబంధించి బ్యాంకులకు ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలలో అత్యంత ఆక్షేపణీయమైనది సిబిల్‌ స్కోరు అని తెలిపారు.

రైతు సిబిల్‌ స్కోరు ప్రాతిపదికపైనే రుణం మంజూరు చేయాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ షరతు కారణంగా చాలామంది రైతులు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారని కేంద్రానికి తెలిపారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సిబిల్‌ లో నమోదైన లావాదేవీల ప్రాతిపదికన డిఫాల్టర్లుగా లేదా సకాలంలో వాయిదాలు చెల్లించలేదన్న కుంటి సాకులతో వ్యవసాయ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంక్‌ లు రుణాలు ఇవ్వడంలేదు అని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాలు రైతులకు మేలు చేయకపోగా కఠినతరమైన ఇలాంటి నిబంధనల వలన వారిని మరిన్ని ఇక్కట్లకు గురిచేయడం జరుగుతోందని ఆయన రైతుల తరపున ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా వర్షాధారం పై ఆధారపడి ఉందని - కానీ - వరదలు - కరువు వల్ల 75 నుంచి 80 శాతం రైతులు నష్టపోతున్నారని - ఈ నేపథ్యంలోనే తీసుకున్న రుణాలని సకాలంలో కట్టలేక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సిబిల్ ఆధారంగా రుణాలని ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదు అని ,కాబట్టి తక్షణమే రైతు రుణాలపై సిబిల్ తప్పనిసరి నియమాన్ని తొలగించాలని కోరారు.