Begin typing your search above and press return to search.

హోదా చ‌ర్చ‌ను తుని ఘ‌ట‌న హైజాక్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   17 Sep 2016 11:26 AM GMT
హోదా చ‌ర్చ‌ను తుని ఘ‌ట‌న హైజాక్ చేస్తుందా?
X
కాపుల ఉద్య‌మం సంద‌ర్భంగా తునిలో హింస చోటుచేసుకున్న సంఘ‌ట‌న తెలిసిందే. అయితే, ఆ ఘ‌ట‌న‌కు బాధ్యులైన‌వారిపై గ‌తంలో కేసులు న‌మోదుచేశారు. ఆ త‌రువాత‌, కొంత‌మందిని నిందితులుగా భావిస్తూ ఏపీ స‌ర్కారు అరెస్టు చేయ‌డంతో తుని ఘ‌ట‌న‌పై ర‌గ‌డ మొద‌లైంది. కాపు ఉద్య‌మ నాయకుడు ముద్ర‌గ‌డ దీక్ష‌కు దిగ‌డం - అరెస్టు అయిన‌ వారిని బెయిలుపై విడుద‌ల చేయ‌డం... అన్నీ జ‌రిగిపోయాయి. అయితే, ఈ కేసు విచార‌ణ మాత్రం ముందుకు సాగుతూనే ఉంది. తుని ఘ‌ట‌న ఎప్పుడు తెర‌మీదికి వ‌చ్చినా ఆంధ్రా రాజ‌కీయాలు హీటెక్కిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మ‌రోసారి తుని ఘ‌ట‌న హెడ్ లైన్స్ లోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే... ఆ ఇష్యూని మ‌రోసారి తెర మీదికి బ‌ల‌వంతంగా తీసుకొస్తున్నారు అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ప్ర‌స్తుతం ఆంధ్రా అంతా ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక ప్యాకేజీల చ‌ర్చ‌తో వేడివేడిగా ఉంది. హోదా ఇస్తామ‌ని కేంద్రం మొండి చెయ్యి చూపింది. హోదాపై పోరాడ‌తామ‌న్న తెలుగుదేశం ప్యాకేజీకి వెల్క‌మ్ చెప్పేసింది. దీంతో ప్ర‌జ‌లు భ‌గ్గుమంటున్నారు. ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హంతో ఉన్నాయి. కేంద్రంపై ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. రాష్ట్రంలోని తెలుగుదేశం నాయ‌క‌త్వంపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు విప‌క్ష పార్టీల‌న్నీ ఒకే వేదిక‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశాలూ క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల‌న్నీ తెలుగుదేశం స‌ర్కారుకు త‌ల‌నొప్పిగానే ప‌రిణ‌మించ‌బోతున్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. తెలుగుదేశం ముందు ప్ర‌స్తుతం ఉన్న‌వి రెండే అప్ష‌న్లు... ఒక‌టీ ప్యాకేజీ గొప్ప‌త‌నాన్ని ఎలాగోలా ప్ర‌జ‌ల్లోకి ఇంజెక్ట్ చేసి భ‌రోసా క‌ల్పించాలి! రెండూ హోదా - ప్యాకేజీల‌పై జ‌నంలో జ‌రుగుతున్న డైవ‌ర్ట్ చేయాలి! మొద‌టిది అంత ఈజీగా కాదు. కాబ‌ట్టి, అధికార పార్టీ రెండో మార్గాన్నే ఎంచుకుందని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తుని ఘ‌ట‌న‌కు సంబంధించి గ‌తంలో వైకాపా సీనియ‌ర్ నాయ‌కుడు భూమాన క‌రుణాక‌ర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌గా వైకాపా మండిప‌డింది. ప్ర‌తిప‌క్షాన్ని రాజ‌కీయంగా దెబ్బ తీసేందుకే తుని ఘ‌ట‌న‌కు బాధ్యులుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శించింది. అయితే, ఆ నోటీసుల‌కు స్పందించి సెప్టెంబ‌ర్ 6 - 7 తేదీల్లో భూమాన విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇప్పుడు మ‌రోసారి భూమాన‌ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. తుని విధ్వంసం విష‌య‌మై ఈ మ‌ధ్య‌నే దాదాపు 16 గంట‌ల‌కు పైగా భూమాన‌ను విచారించారు. ఇంత‌లోనే మ‌ళ్లీ విచార‌ణకు ఆదేశాలు జారీ కావ‌డంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ప్ర‌త్యేక‌హోదా సాధ‌న దిశ‌గా ప్ర‌తిప‌క్షం మ‌రోసారి గ‌ళ‌మెత్తుతోంది. ఈ మ‌ధ్య‌నే రాష్ట్ర బంద్ దిగ్విజ‌యంగా నిర్వ‌హించింది. త్వ‌ర‌లోనే ఏలూరులో యువ‌భేరి కార్య‌క్ర‌మం నిర్వ‌హించేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మౌతున్నారు. పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు వైకాపా ప్ర‌య‌త్నిస్తున్న ఈ త‌రుణంలో తాజా నోటీసులు రావ‌డం వెన‌క వేరే రాజ‌కీయం ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదాపై రాష్ట్రంలో జ‌రుగుతున్న చ‌ర్చను తుని కేసువైపు డైవ‌ర్ట్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా..? ద‌శ‌ల‌వారీగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వైకాపా వ్యూహాన్ని అడ్డుకోవాల‌నే ఉద్దేశంతోనే తాజా నోటీసులు జారీ అయ్యాయా... అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.