Begin typing your search above and press return to search.

గునపంతో తలుపులు పగలగొట్టి.. టీడీపీ కార్యకర్త అరెస్టు!

By:  Tupaki Desk   |   30 Jun 2022 6:32 AM GMT
గునపంతో తలుపులు పగలగొట్టి.. టీడీపీ కార్యకర్త అరెస్టు!
X
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, వైసీపీ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు గార్లపాటి వెంకటేష్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన అధికారులను వెంకటేష్ అడ్డుకున్నారు. నోటీసులివ్వకుండా అరెస్ట్ చేయడానికి రావడం ఏంటని ప్రశ్నించారు.

పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వహకుడు గార్లపాటి వెంకటేష్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో అర్ధరాత్రి వెంకటేష్ నివాసానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో గడ్డపారతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన అధికారులను వెంకటేష్ అడ్డుకున్నారు.

ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి రావడం ఏంటని వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. వెంకటేష్ 'న్యూస్ 25' అనే యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని.. అందుకే తీసుకెళ్తు న్నట్లు చెప్పారని వెంకటేష్ తల్లిదండ్రులు వివరించారు. తమ కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండని ఎంత ప్రాధేయపడినా..

చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఇంట్లో వాళ్ల సెల్ ఫోన్లు అన్ని తీసుకెళ్లారని తల్లిదండ్రులు తెలిపారు. వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు గుంటూరు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.లోకేష్ రియాక్ష‌న్

ధరణికోట గ్రామ వాసి, టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంకటేష్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్నవారంతా.. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు, చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ రెడ్డి సింగిల్‌గా వచ్చే.. సింహంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

ఈ మాదిరి పిరికోడు తన వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకని మండిపడ్డారు. కనీసం ఐడెంటిటీ లేకుండా అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకడం, గునపాలతో తలుపులు పగలగొట్టిన కొంతమంది పోలీసులు వైకాపా గూండాలను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టినా వారి మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యాయంటూ ఘటనకు సంబంధించిన ఓ వీడియో లోకేశ్‌ ట్విట్టర్లో విడుదల చేశారు.