Begin typing your search above and press return to search.

నోడౌట్‌ : ఈసారి అరెస్టే!

By:  Tupaki Desk   |   18 Sept 2016 10:34 AM IST
నోడౌట్‌ : ఈసారి అరెస్టే!
X
చంద్రబాబునాయుడు ప్రభుత్వం విపక్షాలను అణచివేయడానికి అరెస్టులను ఒక మార్గంగా మార్చుకుంటున్నదని ప్రజలు భావిస్తున్నారు. తుని కాపుల సభలో జరిగిన గొడవలకు సంబంధించి... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించడమే ఒక కామెడీ అయితే, ఆయనను మళ్లీ రెండో విడత విచారణకు పిలవడం మరింత కుట్రపూరితంగా కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబుకు సర్కారుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడం ద్వారా వారిలో ఒక భయం పాదుగొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని.. వారు భావిస్తున్నారు.

తునిలో కాపులు నిర్వహించుకున్న సభ అదుపు తప్పి విధ్వంసానికి దారితీసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాపుల ఉద్యమం గొడవలుగా రూపాంతరం చెందడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముడిపెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం తొలినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నది. జగన్‌ మనుషులే.. తుని సభలో విధ్వంసం జరగడానికి కారకులయ్యారని, ప్రేరేపించారనే కోణంలో కేసులు బనాయించారు. అక్కడి ఆందోళనల్లో ఉన్న వారికి ఫోన్లు చేసి పురమాయించారు అనే కారణం మీదనే ఇప్పుడు భూమన కరుణాకరరెడ్డి విచారణ జరుగుతోంది.

మాజీ ఎమ్మెల్యే అయిన కరుణాకరరెడ్డిని ఇప్పటికే పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. ఈ రెండు రోజులు కలిపి సుమారు 15 గంటల విచారణ సాగింది. అయినా పెద్దగా రాబట్టిన కొత్త సంగతులు ఏమీ లేవని అంతా అనుకుంటున్నారు. అయితే పోలీసుల కొన్ని ప్రశ్నలకు భూమన చెప్పిన సమాధానాలను బట్టి, వారు మళ్లీ కౌంటర్‌ దర్యాప్తు చేసి కొత్త వివరాలు రాబట్టి పెట్టుకున్నారని.. ఆమేరకు ఇప్పుడు రెండో విడత విచారణలో భూమనను మరింతగా కేసులో ఇరికించవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. భూమన చెప్పిన పాయింట్లకు తగినట్లుగా వారు ఈ వ్యవధిలో తమ కౌంటర్లను తయారుచేసుకుని ఉంటారు గనుక, ఈసారి విచారణకు వెళ్లిన తర్వాత ఖచ్చితంగా అరెస్టు జరుగుతందనే ప్రచారం పార్టీ వర్గాల్లోనూ నడుస్తోంది.

భూమనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. తొలినుంచి ఆరోపణలు చేస్తోంది. మరి ఈ విచారణ రెండో దశ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.