Begin typing your search above and press return to search.

చంద్రబాబుకి సీఐడీ నోటీసులు..23 న విచారణ..ఆ 500 ఎకరాల అసైన్డ్ భూములే కీలకం!

By:  Tupaki Desk   |   16 March 2021 6:00 AM GMT
చంద్రబాబుకి  సీఐడీ నోటీసులు..23 న విచారణ..ఆ 500 ఎకరాల అసైన్డ్ భూములే కీలకం!
X
ఏపీ రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏపీ‌ సీఐడీ అధికారులు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ కింద నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ - 166 - 167 - 217 - ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977 - ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి.

అమరావతి భూ కుంభకోణంలో 500 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారమే ప్రస్తుతం కీలకంగా మారినట్టు తెలుస్తోంది. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తరువాత.. ఏకంగా 500 ఎకరాల అసైన్డ్ భూములను వేర్వేరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించారు. దీన్ని ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ గా నిర్దారించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్‌ పూలింగ్ ‌లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్ ‌టైమ్‌ సెటిల్‌ మెంట్ లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను - సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ 500 ఎకరాలను కొనుగోలు చేసిన వేర్వేరు వ్యక్తులెవరనేది తేలాల్సి ఉంది. వారంతా చంద్రబాబు బినామీలేననేది అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్లాట్ల కేటాయింపులోనూ వారి పేర్లను చేర్చారనే విమర్శలు ఉన్నాయి. అన్ని రకాలుగా ఆ కొనుగోలుదారులకు లబ్ది కలిగించేలా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, దానికి అనుగుణంగా జీవోలను జారీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి - వాటిని ల్యాండ్‌ పూలింగ్‌ కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉండటం విశేషం. అసైన్డ్‌ భూములను తక్కువకు కొనుగోలుచేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైనవారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగుచూసింది. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసు మరోసారి తెర మీదికి రావడం రాష్ట్రంలో తీవ్ర దుమారానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు లేకపోలేదు. పంచాయతీలు - మున్సిపాలిటీలు - మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.