Begin typing your search above and press return to search.

బాబుపై కేసు.. హైకోర్టుల ఏపీ ప్రభుత్వ వాదన ఏమిటి?

By:  Tupaki Desk   |   20 March 2021 4:52 AM GMT
బాబుపై కేసు.. హైకోర్టుల ఏపీ ప్రభుత్వ వాదన ఏమిటి?
X
అమరావతి కోసం సేకరించిన భూములకు సంబంధించి తప్పులు జరిగాయంటూ నాటి సీఎం చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేయటం.. ఈ నెల 23న వారిని తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చెప్పటం తెలిసిందే. ఈ అంశంపై చంద్రబాబు.. నారాయణలు ఏపీ హైకోర్టును ఆశ్రయించి.. విచారణకు బ్రేక్ వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ సర్కారు తరఫున ఏఏజీ చేసిన వాదనలు ఏమిటి? ఆయన చెప్పిన అంశాలేమిటి? అన్నది చూస్తే..

చంద్రబాబు.. నారాయణ మీద పెట్టిన కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జాస్తి నాగభూషణ్ వాదనలు వినిపించారు. జీవో 41 జారీలో సంబంధిత శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రమే బాధ్యులని.. పిటిషనర్లకు సంబంధం లేదని చెప్పటం సరికాదన్నారు. బిజినెస్ రూల్స్ ను అతిక్రమించి అసైన్డ్ భూముల విషయంలో జీవో తెచ్చారన్నారు. నవలూరులో 70 ఎకరాల అసైన్డ్ భూమి ఉంటే.. 105 ఎకరాలకు ప్లాట్లు ఇచ్చారన్నారు.

అనుచరులకు మేలు చేకూర్చేందుకు జీవో 41 తెచ్చినట్లుగా చెప్పారు. జీవో జారీ అసైన్డ్ చట్ట నిబంధనకు వ్యతిరేకమని కలెక్టర్ చెప్పినప్పటికి.. ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి చెప్పినట్లు అప్పటి జిల్లా కలెక్టర్ వాంగ్మూలం ఇచ్చారన్నారు. జోవో జారీ విషయంలో నాటి ఏజీ ఎలాంటి సలహా ఇవ్వలేదన్నారు. జీవో జారీతో అసైన్డ్ రైతులతో పాటు.. సీఆర్డీయేకు నష్టం వాటిల్లిందన్నారు. జీవో జారీ వెనుక మంచి ఉద్దేశం లేదన్నారు.

సీఆర్డీయేకు నష్టం జరిగితే.. ఆ సంస్థ ఫిర్యాదు చేయాలని కదా అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు స్పందించిన ఏఏజీ.. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని.. దాన్ని కొనసాగిస్తే కొత్త విషయాలు బయటకు వస్తాయన్నారు. అయితే.. న్యాయమూర్తి మాత్రం ఏఏజీ వాదనలపై స్పందిస్తూ.. పిటిషనర్లపై ప్రాసిక్యూషన్ ను నిషేధం వర్తిస్తుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లుగా చెప్పి.. దర్యాప్తులో తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో.. నాలుగు వారాలపాటు విచారణకు బ్రేక్ పడనుంది.