Begin typing your search above and press return to search.

సీఐడీ విచారణకు ‘స్టే’తో చెక్ చెప్పనున్న చంద్రబాబు?

By:  Tupaki Desk   |   17 March 2021 6:30 AM GMT
సీఐడీ విచారణకు ‘స్టే’తో చెక్ చెప్పనున్న చంద్రబాబు?
X
అధికారం చేజారిన 23 నెలల తర్వాత ఏపీ సీఐడీ అధికారులు ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. అమరావతిలో రాజధాని ఏర్పాటు సమయంలో ఎస్సీ.. ఎస్టీలకు చెందిన భూముల్ని కుట్రపూరితంగా తీసుకున్నారని.. దీనికి సంబంధించిన కేసు విచారణకు ఈ నెల 23న హాజరు కావాలని బాబు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పది సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ..140 పేజీల ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేయటం విశేషం.

మరి.. ఈ ఇష్యూను చంద్రబాబు ఎలా డీల్ చేయనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు.. వరుస భేటీలతో మరింతబిజీ అవుతారు చంద్రబాబు. తన తీరుకు తగ్గట్లే.. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిన తర్వాత నుంచి వరుస పెట్టి భేటీల్ని నిర్వహించారు చంద్రబాబు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పాటు ఏపీ టీడీపీ నేతలతో పాటు.. పలువురు లాయర్లతోనూ ఆయన భేటీ అయ్యారు.

సీఐడీ విచారణకు బాబు హాజరు కానున్నారా? లేదా? అన్నది ప్రశ్న. బాబును వెనకేసుకొచ్చే మీడియా కథనాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. విచారణ విషయాన్ని కోర్టులకు తీసుకెళ్లి.. స్టే తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా.. విచారణకు ఆదేశాలుజారీ అయినప్పుడు కోర్టుల్ని ఆశ్రయించటం.. వారి నుంచి స్టే పేరుతో రక్షణ పొందటం అలవాటన్న విమర్శ ఉంది. ఇప్పటికే 18 స్టేలతో బండి లాగిస్తున్న బాబు ఖాతాలో ‘స్టే’ చేరుతుందన్న మాట వినిపిస్తోంది. తాజా నోటీసులకు సంబంధించి కోర్టును ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ.. కోర్టు నుంచి ప్రతికూల పరిస్థితి ఎదురైతే మాత్రం.. విచారణకు హాజరు కాక తప్పదు. అదే జరిగితే.. తొలిసారి బాబుకు పెద్ద పరీక్షనే ఎదుర్కొనున్నారని చెప్పాలి.