Begin typing your search above and press return to search.

1921 నెంబరు నుంచి ఫోన్ వస్తే..వారు అడిగినవన్ని చెప్పాలి

By:  Tupaki Desk   |   23 April 2020 1:30 AM GMT
1921 నెంబరు నుంచి ఫోన్ వస్తే..వారు అడిగినవన్ని చెప్పాలి
X
కరోనా వ్యాప్తి ఎలా ఉందన్న విషయాన్ని తేల్చేందుకు ఏం చేయాలి? అన్నంతనే.. ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించాలన్న సమాధానం వస్తుంది. భారత్ లాంటి దేశంలో అలాంటి ప్రక్రియ చాలా ఖర్చు తో కూడుకున్నదే కాదు.. చాలా క్లిష్టమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అలాంటి ర్యాండమ్ టెస్టులు నిర్వహించే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. అలాంటప్పుడు కరోనా నియంత్రణ ఎలా ఉందన్న విషయం పై అవగాహన పెంచుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ర్యాండమ్ గా కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేసుకొని.. కొందరికి ఫోన్లు చేసి పలు ప్రశ్నలు అడిగి.. వారి నుంచి వచ్చే సమాధానాల ద్వారా కరోనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అన్న విషయం పై అవగాహనకు రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

ఈ ప్రక్రియలో భాగంగా 1921 నెంబరు నుంచి టెలిఫోన్ సర్వేను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యం లో 1921 నెంబరు నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించాలని.. సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు.. 1921 కాకుండా మరే నెంబరు నుంచి ఫోన్ వచ్చినా.. ఎలాంటి సమాచారాన్ని ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటివరకూ కరోనా లక్షణాల లెక్క తేల్చేందుకు పాలిమెరేజ్ చైన్ రియాక్షన్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గొంతు.. ముక్కులో నుంచి తీసిన శాంపిల్ ను పరీక్షించటం ద్వారా కరోనా లక్షణాలు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని నిర్దారిస్తున్నారు. అయితే.. ఈ విధానంలో ఫలితాలు రావాలంటే ఐదారు గంటల సమయం పట్టనుంది. దీంతో.. దానికి బదులుగా రాపిడ్ యాంటీబాడీ టెస్టును నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఫలితం అరగంటలోనే వచ్చేయనుంది.

ఈ నేపథ్యం లో ఇలాంటి కిట్లను చైనా నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఐదు లక్షల కిట్లను చైనా నుంచి తెప్పించి.. కేసులు పెరుగుతున్న వివిధ రాష్ట్రాలకు వాటిని పంపారు. అయితే.. ఈ కిట్ల నాణ్యతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. టెలిఫోనిక్ సర్వే ద్వారా.. కరోనా లక్షణాలు ఏ ప్రాంతంలో ఏ మేర ఉన్నాయన్న విషయాన్ని చెక్ చేసే ప్రయత్నానికి తెర తీశారు.