Begin typing your search above and press return to search.

జీఎస్టీ పేరుతో ప్ర‌ముఖ సంస్థ‌లూ దోచేశాయా?

By:  Tupaki Desk   |   29 Oct 2017 10:04 AM GMT
జీఎస్టీ పేరుతో ప్ర‌ముఖ సంస్థ‌లూ దోచేశాయా?
X
అవ‌కాశం ఉండాలే కానీ చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా వ్యాపార సంస్థ‌లు చెల‌రేగిపోతాయ‌న్న‌ది మ‌రోసారి నిరూపిత‌మైంది. క‌స్ట‌మ‌ర్ల‌ను దోచేసే చిన్న అవ‌కాశం ల‌భించినా విడిచిపెట్ట‌ని తీరు హైద‌రాబాదీయుల‌కు షాకింగ్ గా మారింది. ఈ లెక్క‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత‌మంది ఈ తీరులో దోచేస్తున్నార‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

ఒక దేశం ఒక ప‌న్ను పేరుతో జీఎస్టీని అస‌రాగా చేసుకొని అన్యాయంగా ప‌న్ను బాదేస్తున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఇంత‌కాలం ఎందుకు కామ్ గా ఉన్నారో కానీ.. ఇప్పుడు ఉన్న‌ట్లుండి పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌కు మెలుక‌వ వ‌చ్చింది. జీఎస్టీ అమ‌లు త‌ర్వాత కొన్ని వ్యాపార సంస్థ‌లు ఎమ్మార్పీ ధ‌ర కంటే ఎక్కువ ధ‌ర‌లు అమ్మితే.. మ‌రికొంద‌రు ధ‌ర‌ల ట్యాగ్ లు లేకుండా వ‌స్తేవుల్ని అమ్మేయ‌టం.. మ‌రికొంద‌రు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అమ్మ‌కాలు జ‌రుపుతున్న వైనంపై తెలంగాణ రాష్ట్ర అధికారులు క‌న్నెర్ర చేశారు.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ప‌లు ప్ర‌ముఖ షాపింగ్ మాల్స్‌.. సినిమా థియేట‌ర్ల‌తో పాటు.. చైన్ ఐస్ క్రీం పార్ల‌ర్లు.. ప్ర‌ముఖ హోట‌ళ్లు.. రెస్టారెంట్లు.. వ‌స్త్ర దుకాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత వేయాల్సిన ప‌న్ను బాదుడుకు భిన్నంగా భారీగా బాదేస్తున్న హెట‌ళ్ల‌ను అధికారులు గుర్తిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. క‌దిలిన యంత్రాంగం హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్స్ లు.. వ‌స్త్ర‌దుకాణాలు.. రెస్టారెంట్ల‌తో స‌హా ప‌లు వాణిజ్య సంస్థ‌ల్లో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఇందులో అధికారికంగా వ‌సూలు చేయాల‌న్న దాని కంటే జీఎస్ఈ పేరు చెప్పి భారీగా దోచేస్తున్నారు. ఈ తీరు హైద‌రాబాద్ తో పాటు.. ప‌లు జిల్లా కేంద్రాల్లో కూడా అనుస‌రిస్తున్నారు. అధికారుల ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సుజ‌నామాల్.. ఐనాక్స్.. బిగ్ బ‌జార్‌.. మోర్.. ర‌త్న‌దీప్‌.. హైప‌ర్ మార్కెట్ లాంటి వాటితో పాటు.. సితార గ్రాండ్‌.. అమ‌రావ‌తి హోట‌ల్‌.. సంతోష్ డాబా.. చిల్లీస్‌.. త‌దిత‌ర వాణిజ్య సంస్థ‌ల‌పై కేసులు న‌మోదు చేశారు.

కొన్ని రెస్టారెంట్ల‌లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధ‌ర‌కు వాట‌ర్ బాటిళ్లు అమ్మ‌టాన్ని గుర్తించారు. ఇది చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్న విష‌యాన్ని చెబుతూ కేసులు న‌మోదు చేశారు. జీఎస్టీ పేరుతో ప‌న్ను వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న వాణిజ్య సంస్థ‌ల‌పై కేసులు న‌మోదు చేస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం సామాన్యుడికి షాకింగ్ గా మారింద‌ని చెప్పాలి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో నిర్వ‌హించిన త‌నిఖీల్లో పేరున్న ప‌లు వాణిజ్య సంస్థ‌లు ఇలా దొరికిపోవ‌టం చూస్తే.. సామాన్యుడ్ని ఇంత దారుణంగా మోసం చేశారా? అన్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. చూస్తుంటే... సందు దొర‌క‌ట‌మే ఆల‌స్యం బాదుడుతో షాకులివ్వ‌టానికి వాణిజ్య సంస్థ‌లు ఎంత‌లా సిద్ధంగా ఉన్నాయ‌న్న విష‌యం తాజా ప‌రిణామం చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.