Begin typing your search above and press return to search.

అంతర్యుద్ధం మొదలైనట్లేనా ?

By:  Tupaki Desk   |   23 Aug 2021 5:03 AM GMT
అంతర్యుద్ధం మొదలైనట్లేనా ?
X
ఆఫ్ఘనిస్దాన్ లో అంతర్యుద్ధం మొదలైనట్లే అర్ధమవుతోంది. దేశాధిపత్యాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు, తాలిబన్లను వ్యతిరేకిస్తున్న దళాలకు మధ్య కొన్నిచోట్ల గొడవలు మొదలయ్యాయి. గొడవలంటే కాల్పులు జరగటం, బంధీలుగా పట్టుకోవటం కూడా జరిగింది. దీంతో రెండు గ్రూపుల మధ్య అంతర్యుద్ధం మొదలైనట్లే ప్రపంచానికి అర్ధమవుతోంది. దేశాధిపత్యాన్ని చెరబట్టిన తాలిబన్ల నుండి దేశ సార్వభౌమాధికారాన్ని విడిపించటం కోసం మొదట ప్రజలే నిరసన కార్యక్రమాలను మొదలుపెట్టారు.

జనాల్లోని మూడ్ చూసిన తర్వాత తాలిబన్ వ్యతిరేకదళాలు నెమ్మదిగా రోడ్లపైకి రావటం మొదలుపెట్టాయి. ప్రధానంగా పంజ్ షీర్ ప్రాంతంలోని తాలిబన్ వ్యతిరేకదళాలు అత్యంత అధునాతన ఆయుధాలతో జనాల్లోకి వచ్చేశారు. దీని ఫలితంగానే తాలిబన్లపై ఎక్కడికక్కడ తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే బగ్లాన్ ప్రావిన్సులోని నాలుగు జిల్లాల నుండి తాలిబన్లను తరిమేశారు. నాలుగు జిల్లాలను పంజ్ షీర్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు.

ఈ జిల్లాల్లో తిరుగుబాటుదారులు-తాలిబన్లకు మధ్య జరిగిన గొడవల్లో 11 మంది తాలిబన్లు చనిపోయారు. పైగా మరో కమాండర్ స్ధాయి నేతతో పాటు మరో 7 మందిని తిరుగుబాటుదారులు బంధీలుగా పట్టుకోవటం దేశంలో సంచలనంగా మారింది. తాలిబన్ల పాలనలో 11 మంది తాలిబన్లను చంపటంతో పాటు మరో 8మందిని బంధీలుగా పట్టుకోవటమంటే మామూలు విషయంకాదు. దీని ఫలితంగా తమపై తిరుగుబాటు చేస్తున్న జనాలపైకి వేరే ప్రాంతంలో తాలిబన్లు జరిపిన కాల్పుల్లో ఏడుమంది చనిపోయారు.

అంతర్జాతీయ మీడియా సమాచరం ప్రకారం తిరుగుబాటుదారులు రోజు రోజుకు దేశంలోని అనేక ప్రావిన్సుల్లోకి చొచ్చుకుపోతున్నారు. క్షేత్రస్ధాయిలోని పరిణామాలను గమనిస్తుంటే ఒకపుడు దేశాన్ని ఏకపక్షంగా, అరాచకాలతో పాలించటం సాధ్యమయ్యేట్లులేదు. అప్పట్లో కూడా తాలిబన్లతో పంజ్ షీర్లకు పడకపోయినా తాలిబన్లను తమ ప్రాంతంలోకి చొచ్చుకురాకుండా ఆపటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఇపుడు స్ధానిక జనాల సహకారంతో పంజ్ షీర్లు తాలిబన్ల మీద తిరుగుబాటు మొదలుపెట్టేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే అంతర్యుద్ధాన్ని రెండు గ్రూపులు ముందుగా పసిగట్టినట్లే ఉన్నాయి. అందుకనే తమకు మద్దతుగా నిలిచే ఉగ్రవాదులను, తీవ్రవాదులను దేశంలోకి రావాల్సిందిగా తాలిబన్లు పిలుపిచ్చారు. ఇదే సమయంలో తాలిబన్ల వ్యతిరేకలంతా పంజ్ షీర్లకు మద్దతుగా ఒకటవుతున్నారు. కాబట్టే ఇంత తొందరగా తాలిబన్లపై దేశంలో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్ వ్యతిరేకులు అనేక ప్రాంతాలలోకి చొచ్చుకుపోతున్న కారణంగానే అంతర్యుద్ధం మొదలైపోయింది.