Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్కారు సీజే స‌పోర్ట్‌..విప‌క్షాల ఫైర్‌

By:  Tupaki Desk   |   26 April 2018 11:27 AM GMT
మోడీ స‌ర్కారు సీజే స‌పోర్ట్‌..విప‌క్షాల ఫైర్‌
X
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయ‌న సమర్థించారు. సీనియర్ అడ్వొకేట్ ఇందు మల్హోత్రాను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడంపై స్టే విధించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం జోసెఫ్‌ ను సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ చేయాలన్న కొలీజియం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయాన్ని కూడా సీజేఐ సమర్థించారు. అందులో తప్పేమీ లేదని దీపక్ మిశ్రా అన్నారు. ఇందు మల్హోత్రా అపాయింట్‌ మెంట్‌ ను ఆపడం సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు. ఇందు మల్హోత్రా - కేఎం జోసెఫ్‌ ల పేర్లను జనవరిలో కొలీజియం సిఫారసు చేసింది. మల్హోత్రా పేరుకు ప్రభుత్వం ఓకే చెప్పి.. జోసెఫ్ అపాయింట్‌ మెంట్‌ ను మాత్రం ఆమోదించలేదు.

దీని వెనుక బలమైన కారణమే ఉంది. 2016లో ఇదే జస్టిస్ జోసెఫ్.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయించారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బలా తగలింది. ఇప్పుడు ఆయన ప్రమోషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తంచేసింది. గురువారం ఉదయమే కేఎం జోసెఫ్ ప్రమోషన్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొలీజియంకు లేఖ రాశారు. సీనియర్ అడ్వొకేట్ ఇందు మల్హోత్రాను సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేసినట్లు కూడా ఇదే లేఖలో ఆయన తెలిపారు. ఎంతోమంది సీనియర్ జడ్జీలను కాదని జోసెఫ్‌ ను ప్రమోట్ చేయడం సరికాదని ఆ లేఖలో రవిశంకర్ ప్రసాద్‌ స్పష్టంచేశారు. కాగా, సీజేఐ నిర్ణ‌యం త‌మ‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని కాంగ్రెస్ పేర్కొంది. ఇలా స‌మ‌ర్థించ‌డం స‌రికాద‌ని పేర్కొంది.