Begin typing your search above and press return to search.

మనోళ్ల టీకాను మనోళ్లే వెనక్కి లాగారు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   24 Dec 2021 5:31 AM GMT
మనోళ్ల టీకాను మనోళ్లే వెనక్కి లాగారు.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
X
దేశ అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగోడి గొప్పతనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలన్నారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని.. విమర్శించే బానిస మనస్తత్వం నుంచి బయటపడాలన్నారు. తెలుగు వారికి గుర్తింపు రాకుండా వ్యవహరించారని.. తెలుగువారు తయారు చేసిన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పని చేస్తుందని.. కొత్త వేరియంట్ ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు.

అలాంటి టీకా మన దేశంలో తయారైనా కొందరు నిరుత్సామపరిచారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రావాల్సిన గుర్తింపు రాకుండా పలు ప్రయత్నాలు చేశారన్నారు. ఒకవైపు బహుళ జాతి కంపెనీలు భారత్ లో తయారైన వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకుండా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు మనోళ్లు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నించారన్నారు. తెలుగువాళ్లలో ఐక్యత అవసరమని.. తెలుగు భాష.. కల్చర్.. సంప్రదాయాల్ని పాటించాలని కోరారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది పురస్కారం అందుకుంటున్న వారిలో భారత్ బయోటెక్ ఎండీ క్రిష్ణా ఎల్లా దంపతులకు లభించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని.. కనీసం ఇంట్లో అయినా మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. అవార్డుగ్రహీతల్లో ఒకరైన క్రిష్ణా ఎల్లా..సుచిత్ర ఎల్లాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు.

అమెరికాలో వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారని.. క్రిష్ణ పరిశోధనలు చేస్తున్నప్పుడు ఆయనకు అండగా నిలిచేందుకు.. సుచిత్ర ఉద్యోగం చేశారన్నారు. దేశానికి ఏదైనా సేవ చేయాలని వారు ఇక్కడకు వచ్చి కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. ఒక దశలో వారు వెనక్కి వెళ్లిపోవాలనుకున్నారని.. మనో నిబ్బరంతో నిలబడి కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసి భారత కీర్తి పతాకను గగన వీధుల్లో ఎగురవేశారన్నారు. ఈ పురస్కారాన్ని క్రిష్ణా ఎల్లాతోపాటు.. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు.. విశేష పురస్కారం బ్రహ్మనందం.. ప్రొఫెసర్ దుర్గా పద్మజ.. సినీ జర్నలిస్టు ఎస్వీ రామారావుతో పాటు విశేష పురస్కారం యాంకర్ సుమ.. డాక్టర్ మస్తాన్ యాదవ్.. బండ్లమూడి శ్రీనివాస్ కు దక్కింది. 2020, 2021 సంవత్సరాలకు ఈ పురస్కారాల్ని అందజేశారు.