Begin typing your search above and press return to search.

నాకూ ఎన్నో అగ్నిపరీక్షలు.. చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయి.. సీజేఐ

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:31 PM GMT
నాకూ ఎన్నో అగ్నిపరీక్షలు.. చదువుతుంటే కన్నీళ్లు వచ్చాయి.. సీజేఐ
X
ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న తెలుగోడు ఎన్వీ రమణ తరచూ వార్తల్లో కనిపిస్తున్నారు. క్రియాశీలకంగా వ్యవహరించటం.. సీజేఐగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. వ్యవస్థల్ని మరింత చైతన్యపరిచేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. సీజేఐ పదవికి కొత్త కళ వచ్చేలా ఆయన చర్యలు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు రాసిన ఆత్మకథ 'ఒదిగిన కాలం'పైసీజేఐ తాజాగా స్పందించారు.

ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే సందర్భంలో ఆయన ఒక వీడియో సందేశాన్ని పంపారు. అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రముఖ కేన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటి పెద్ద మనిషికీ నీలాపనిందలు తప్పలేదు. తనపై వచ్చిన ఫిర్యాదుల గురించి రెండేళ్లు సాగిన విచారణగురించి.. ఓర్పుగా ఉంటూ అగ్నిపరీక్షలో పునీతమైన సీతలాగా బయపడిన వైనాన్ని ఆత్మకథలో ఒకింత బాధతో ఏకరువు పెట్టారు. నాకూ ఇలాంటి పరీక్షలు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. ఆయన అనుభవించిన క్షోభను అర్థంచేసుకోగలను.సత్యం గెలిచి తీరుతుంది' అని పేర్కొన్నారు.

బాల్యంలో నోరి దత్తాత్రేయుడు ఎదుర్కొన్న కష్టాలు.. ఆయన తల్లి చేసిన త్యాగాలు.. బంధుమిత్రుల ప్రోత్సాహం గురించి చదువుతుంటే తన కళ్లల్లో నీళ్లు ఆగలేదన్నారు. ప్రతి ఒక్కరి మనసును ఈ పుస్తకం హత్తుకుంటుందన్న ఆయన.. భారత్ లాంటి వర్ధమాన దేశాలకు వైద్య రంగానికి సంబంధించిన విలువైన సందేశం ఉందన్నారు.

నోరి దత్తాత్రేయుడు తెలుగువాడిగా జన్మించటం అందరం చేసుకున్న పుణ్యమన్న ఆయన.. అమెరికా లాంటి దేశాలు వైద్య రంగంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి.. టెక్నాలజీ లాంటి వాటిని విడమరిచి చెప్పారన్నారు. నోరి సేవల్ని మన ప్రభుత్వాలు ఉపయోగించుకోవటానికి ముందుకు రావాలన్న జస్టిస్ ఎన్వీ రమణ మాటల్ని చూస్తుంటే.. తాను పలు సందర్భాల్లో రాజకీయంగా ఎదుర్కొన్న తీవ్ర ఆరోపణల్ని గుర్తుకు తెచ్చుకున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని తాజా సందర్భంలో పరోక్షంగా ప్రస్తావించారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.