Begin typing your search above and press return to search.

దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాల్సింది మీడియానే?

By:  Tupaki Desk   |   30 Dec 2021 8:44 AM GMT
దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాల్సింది మీడియానే?
X
దుష్టశక్తుల బారి నుంచి న్యాయవ్యవస్థను కాపాడడం మీడియా బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఉన్న న్యాయవ్యవస్థ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజ్యాంగపరమైన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులను, న్యాయమూర్తులను విమర్శించడం ఒక ట్రెండ్ గా మారిందన్నారు. ఉద్దేశ పూర్వక దాడులు, విద్రోహ శక్తుల దాడుల నుంచి న్యాయవ్యవస్థకు రక్షణ కల్పించే బాధ్యత మీడియాపై ఉందని చెప్పారు.

ప్రజాస్వామ్య లక్ష్యాల కోసం.. జాతీయ ప్రయోజనాల కోసం మీడియా, న్యాయవ్యవస్థ కలిసికట్టుగా పనిచేయాలని సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మీడియా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛకు సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ మద్దతు పలుకుతూనే ఉంటుందన్నారు. యాజమాన్యాలు సహా మీడియాలో భాగస్వామిగా ఉండే ప్రతి ఒక్కరూ ఈ స్వేచ్ఛను ఉపయోగించుకోవాలని.. వాస్తవాలనే ప్రజలకు చేరవేయాలని కోరారు.

సోషల్ మీడియా తప్పుడు వార్తలను క్షణాల్లో ప్రచారం చేస్తోందని.. ఒక్కసారి పబ్లిష్ అయిన వార్తనువెనక్కి తీసుకోవడం కష్టమని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మాదిరిగా సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యం కావడం లేదన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి జర్నలిస్టు వృత్తి నిపుణులే స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. తమను తాము రక్షించుకునే స్తితిలో లేని వారిపై వ్యతిరేక వార్తలు రాసేటప్పుడు మీడియా సహజ న్యాయసూత్రాలను పాటించాలని సూచించారు.

తీర్పుల గురించి ప్రవచనాలు చెప్పడం.. న్యాయమూర్తులను విలన్లుగా చిత్రీకరించడం మానుకోవాలని తెలిపారు. న్యాయవాద వృత్తి లాగా జర్నలిస్టుకు కూడా బలమైన నైతిక దృక్పథం ఉండాలని జస్టిస్ రమణ అన్నారు. చైతన్యమే జర్నలిస్టును వృత్తిలో ముందుకు నడిపిస్తుందని చెప్పారు. భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ పవిత్రమైన హక్కు అన్నారు. స్వేచ్ఛ లేకపోతే చర్చకు ఆస్కారం ఉండదని.. ప్రజలకు అవసరమైన సమాచార వ్యాప్తి కూడా జరగదని తెలిపారు.