Begin typing your search above and press return to search.

20 ఏళ్ల క్రితం విడిపోయారు.. వారిని కలిపిన సీజేఐ చీఫ్ జస్టిస్ రమణ

By:  Tupaki Desk   |   29 July 2021 3:44 AM GMT
20 ఏళ్ల క్రితం విడిపోయారు.. వారిని కలిపిన సీజేఐ చీఫ్ జస్టిస్ రమణ
X
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన ముద్రను వేస్తున్న జస్టిస్ ఎన్నవీ రమణ.. తాజాగా సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇరవై ఏళ్ల క్రితం విడిపోయిన భార్యభర్తల్ని మాట్లాడి ఇద్దరిని కలిపించిన వైనం దాంపత్య విభేదాల పరిష్కారానికి సరికొత్త సొల్యూషన్ గా చెప్పక తప్పదు. ఆయన చొరవపై పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కుటుంబ పెద్దలా వారికి సర్ది చెప్పిన ఆయన తీరు దేశ వ్యాప్తంగా న్యాయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమైంది.

న్యాయ ప్రక్రియలో మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను ఇటీవల కాలంలో పదే పదే ప్రస్తావిస్తున్న జస్టిస్ రమణ.. తన మాటల్లోనే కాదు చేతల్లోనూ చేసి చూపించారు. పెళ్లైన తర్వాత బిడ్డ పుట్టిన ఏడాదికి విడిపోయిన దంపతుల్ని తిరిగి కలిపారు. అందుకు వ్యక్తిగత చొరవతో పాటు.. వారికి ఇంగ్లిషు.. హిందీ రాదని చెప్పటంతో వారి తల్లిభాష అయిన తెలుగులోనే మాట్లాడారు. ఈ సందర్భంగా ధర్మాసనంలోని మరో న్యాయమూర్తికి అర్థమయ్యేలా చెప్పిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ కేసేమిటి? అసలేం జరిగిందంటే..

గుంటూరు జిల్లా గుజరాల డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న శ్రీనివాసశర్మకు 1998లో శాంతి అనే మహిళతో పెళ్లైంది. వారికి 1999లో కొడుకు పుట్టాడు. ఇంట్లో గొడవలతో 2001లో వారిద్దరు విడిపోయారు. భర్త.. ఆయన కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని భర్త.. ఆయన సోదరి.. తల్లిపై శాంతి 498ఏ కింద కేసు పెట్టారు. ఈ కేసును విచారించిన గుంటూరు ఆరో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ శ్రీనివాస శర్మకు ఏడాది జైలు.. వెయ్యి రూపాయిల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారిని నిర్దోషులుగా విడిచి పెట్టారు.

అనంతరం అప్పీలు చేసుకుననప్పటికి గుంటూరులోని ఫస్ట్ అప్పిలేట్ కోర్టు కూడా శిక్షను ఖరారు చేసింది. దీంతో మరోసారి హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. శిక్షను తగ్గిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ శాంతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భార్యభర్తల మధ్య విడాకులు మంజూరు కాకపోవటంతో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్న సూచనతో అత్యున్నత న్యాయస్థానం కేసును హైకోర్టు మీడియేషన్ సెంటర్ కు 2012లో పంపారు. అయితే.. అక్కడ సయోధ్య కుదర్లేదు. దీంతో మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు కేసు వచ్చింది.

ఫిబ్రవరి 18న ఈ కేసు జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం వద్దకు వచ్చింది. 2001 నుంచి భార్యభర్తలు విడిపోయినప్పటికి శ్రీనివాసశర్మ తన భార్య.. బిడ్డ కోసం నెలవారీగా మొయింటెన్స్ ను పంపుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనకు శిక్ష పెంచి జైలుకు పంపితే ఆయన ఉద్యోగం పోతుందని.. దాని వల్ల భార్యకు నెలవారీగా పంపే మొయింటెన్స్ పంపటం సాధ్యం కాదని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. దాని వల్ల ఇద్దరు నష్టపోతారన్నారు.

తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది.ఈ వివాదాన్ని భార్యభర్తల మధ్య అంగీకారంతో పరిష్కరిద్దామని న్యాయవాదులకు చెప్పిన సీజేఐ.. వీడియో కాన్ఫెరెన్సు కు వారిద్దరిని రమ్మన్నారు. ఇద్దరూ ధర్మాసనం ముందుకు రావటంతో వారితో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. మరో న్యాయమూర్తికి అర్థమయ్యేలా ఇంగ్లిషులో మాట్లాడాలని కోరగా.. శాంతి తనకు తెలుగుతప్పించి మరే భాష రాదని చెప్పటంతో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో తెలుగులో మాట్లాడి.. ఆమె చెప్పిన విషయాల్ని తన సహచర న్యాయమూర్తికి తర్జుమా (ట్రాన్స్ లేట్) చేశారు.

చివరకు ప్రధాన న్యాయమూర్తి చొరవతో.. భార్యభర్తలు ఇద్దరుకలిసి ఉంటామని.. చిన్న విషయాలకు గొడవ పెట్టుకోమని మాట ఇవ్వటంతో పాటు అఫిడవిట్ కూడా ఇస్తామని చెప్పారు. కలిసి ఉండేందుకు భార్యభర్తలు ఇద్దరు ఒప్పుకున్నారు. దీంతో..కేసు ఉపసంహరించుకునేలా దరఖాస్తు చేసుకోవాలని సూచన చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చిన్న విషయాలకు గొడవ పడకండి.. పరస్పరం అర్థం చేసుకొని ఒకరినొకరు చూసుకొని బతకండి.. జరిగినవి జరిగిపోయాయి.. ఇరవై ఏళ్లు కష్టపడ్డారు. అంతకు మించి ఏమీ లేదు.. కనీసం బిడ్డ కోసమైనా చక్కగా ఉండండి. శర్మగారు మీరు ఇకనైనా సరిగా ప్రవర్తించకండి.. భార్యను వేధించకండి’ అని చెప్పటం.. అందుకు ఇరువురు ఏకాభిప్రాయానికి రావటంతో రెండుదశాబ్దాల క్రితం విడిపోయిన జంట తాజాగా కలిసినట్లైంది.