Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   29 Aug 2021 11:30 PM GMT
ఎన్టీఆర్ పై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
X
ఎన్టీఆర్ రామారావు అధికారంలోకి రావటంపైన సీజేఐ ఆసక్తికర విశ్లేషణ చేశారు.‘వీధి అరుగు-దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ నిర్వహించిన తెలుగు భాష దినోత్సవ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని సీజేఐ సూచించారు. ఆంగ్లం మోజులో పడి తెలుగుభాషను నిర్లక్ష్యం చేయడం తగదని తెలిపారు. ఎన్టీఆర్ సినిమా నటుడు కావడంతో సులువుగా అధికారంలోకి వచ్చారని అభిప్రాయపడుతుంటారని.. అయితే నాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు ఖచ్చితంగా అనుకూలించాయని చెప్పారు. అందులో సందేహం లేదంటూనే తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉందన్నారు.

ఎన్టీఆర్ ఊరూరా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుతమైన ఉచ్చారణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందని విశ్లేషించారు.

ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

భాషను కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందన్నారు. తెలుగు మాధ్యమంలో చదివితే భవిష్యత్ ఉండదనే అపోహలు తొలగించాలని సూచించారు. డిగ్రీ వరకు తాను తెలుగు మాధ్యమంలోనే చదివానని చెప్పారు.

ఇంగ్లీష్ అభ్యాసం ఎనిమిదో తరగతిలో మొదలైందని సీజేఐ వివరించారు. ఉద్యోగ ధర్మం కనుక అంగ్లంలో అభ్యాసం వాడకం కొనసాగిస్తున్నానని సీజేఐ చెప్పుకొచ్చారు. పల్లెటూరిలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకొని ఈరోజు నేను ఈ స్తాయికి చేరుకోగలిగానని చెప్పారు.

పాఠ్యపుస్తకాలు, విద్యాబోధన వ్యవహారికంలో కొనసాగడం తన లాంటి వారికి ఎంతో ఉపయోగిందన్నారు. పోటీని తట్టుకోవాలంటే ఇతర భాషలను ప్రధానంగా ఆంగ్ల భాషను విస్మరించలేమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. అలా అని ఆంగ్లం కోసం తెలుగును త్యాగం చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.