Begin typing your search above and press return to search.

వెంకన్నకు అన్నీ తెలుసు: సీజేఐ

By:  Tupaki Desk   |   30 Sep 2021 4:30 AM GMT
వెంకన్నకు అన్నీ తెలుసు: సీజేఐ
X
జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐగా బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి న్యాయవ్యవస్థలో సంస్కరణ చేసేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన టీటీడీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వరస్వామికి అన్నీ తెలుసని, టీటీడీలో తప్పులు జరిగితే శ్రీవారు ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీజేఐ అన్నారు. ఓ భక్తుడు తిరుమలలో శ్రీవారికి పూజా కార్యక్రమాలు సరిగా జరగడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ''నేను కూడా వెంకటేశ్వరస్వామి భక్తుడనేనని, స్వామి మహిమలు అందరికీ తెలుసు'' అంటూ తెలుగులో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తిరుమలలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజులు జరగడం లేదని శ్రీవారి భక్తుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

పూజలు ఎలా నిర్వహించాలి అన్నది న్యాయపరమైన అంశం కానప్పటికీ టీటీడీలో పూజలన్నీ సక్రమంగానే జరగుతున్నాయని తాము భావిస్తున్నామని ఎన్వీ రమణ పేర్కొన్నారు. పూజలు సక్రమంగా జరగకపోతే వెంకటేశ్వరస్వామి ఉపేక్షించరని, ఆయన మహిమలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తనతో పాటు ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలు కూడా వెంకటేశ్వరస్వామి భక్తలమేనని వెల్లడించారు. అయితే అసలు పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఏమైనా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు వారం లోగా సమాధానం ఇవ్వాలని టీటీడీ తరపున వాదిస్తున్న న్యాయవాదికి సీజేఐ ధర్మాసనం అవకాశం ఇచ్చింది. ఈ కేసుపై విచారణను వచ్చే వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. టీటీడీలో జరిగే పూజల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవంటూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

ఇటీవల టీటీడీ జంబో పాలకమండలిపై అనేక విమర్శలు వచ్చాయి. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామక ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. వీరి నియామకం చట్టనిబంధనలకు వ్యతిరేకమని కోర్టు పేర్కొంది. 568, 569 నంబరు జీవోలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. దీనిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. టీటీడీ బోర్డులో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులనుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 568, జీవో 569ని సవాల్‌ చేస్తూ అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన ఉమామహేశ్వర్, హిందూ జనశక్తి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లలిత్‌కుమార్‌ వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. మరోవైపు టీటీడీ దర్శన టికెట్లపై పలు విమర్శలు వచ్చాయి. దర్శన టికెట్ల కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత 'జియోమార్ట్‌' సబ్‌డొమైన్‌లోకి వెళ్లడంపై నెటిజన్లు తప్పుబట్టారు.