Begin typing your search above and press return to search.

హైకోర్టు సీజేలతో సీజేఐ ఎన్వీ రమణ వర్చువల్‌ భేటీ.. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   5 Jun 2021 10:30 AM GMT
హైకోర్టు సీజేలతో సీజేఐ ఎన్వీ రమణ వర్చువల్‌ భేటీ.. ఎందుకంటే ?
X
కరోనా వైరస్ విజృంభణ సమయంలో దేశంలో కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వీ రమణ వర్చువల్‌ భేటీ నిర్వహించి తెలుసుకున్నారు. హైకోర్టుల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన తరువాత , హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ సమీక్షా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. కోర్టుల్లో పనిచేస్తున్న వారిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించి ప్రాధాన్యమిస్తూ టీకాలు అందించాలని కొందరు ప్రధాన న్యాయమూర్తులు కోరారు. దీనిపై తాను సంబంధిత సంస్థలతో మాట్లాడతానని సీజేఐ రమణ హామీ ఇచ్చారు. పెండింగ్‌ కేసులు, జ్యుడీషియల్‌ అకాడమీల పనితీరు కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.

కోర్టుల్లో పోస్టుల భర్తీని వేగవంతం చేయాల్సి ఉందని జూన్‌ 1, 2 తేదీల్లో జరిగిన ఈ వర్చువల్‌ సమావేశాల్లో ఆయన తెలిపారు. ప్రస్తుత తరుణంలో న్యాయం అందించడంలో జరుగుతున్న జా ప్యానికి మౌలిక వసతుల లేమి, డిజిటల్‌ డివైడ్‌ లు ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయంతో ఆధునిక కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి నేషనల్‌ జ్యూడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేయాలని జస్టిస్‌ రమణ సూచించారు. ప్రస్తుతం 25 హైకోర్టుల్లో 1,080 మందికి గానూ 660 మంది జడ్జీలే ఉన్నారని న్యాయ శాఖ తెలిపింది. కాగా, జిల్లాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో డిజిటల్‌ అవగాహనలో ఉన్న వ్యత్యాసాలు న్యాయవ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేయకపోతే న్యాయం అందించే విషయంలో కింది కోర్టుల నుంచి అద్భుతాలు ఆశించలేమని అన్నారు. అదే విధంగా ఖాళీల భర్తీని కోర్టులు వేగవంతం చేయాలని, ముఖ్యంగా హైకోర్టులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల కోసం సుప్రీంకోర్టుకు ప్రతిపాదనలు పంపించేటప్పుడు సామాజిక వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు చెప్పారు. అణగారిన వర్గాలు, దళితులు, మైనారిటీలు, మహిళలు అందరికీ న్యాయవ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం అవసరమని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో మహిళలు, ఇతర వర్గాలకు సమాన ప్రాతినిధ్యం లభించడం లేదని, సామాజిక న్యాయం జరగడం లేదని వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని సీజేఐ రమణ ఈ కీలక ప్రతిపాదన చేశారు. సుప్రీంకోర్టులో ప్రధానంగా వాదించే న్యాయవాదుల పేర్లను వారి పరిధిలోని హైకోర్టు జడ్జిల నియామకాలకు పరిశీలించాలంటూ వివిధ న్యాయవాద సంఘాలు చేసిన విజ్ఞప్తులను కూడా సీజేఐ హైకోర్టు సీజేల ముందు ఉంచారు.