Begin typing your search above and press return to search.

సీజేఐ రమణ వ్యాఖ్యలు ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగానేనా?

By:  Tupaki Desk   |   26 Dec 2021 5:53 AM GMT
సీజేఐ రమణ వ్యాఖ్యలు ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగానేనా?
X
ఒకే వేదికపై ఇద్దరు మొన్నటి ప్రత్యర్థులు కలుసుకోవడం చర్చనీయాంశమైంది. సరదాగా పాత పగలు అన్ని మరిచిపోయి మాట్లాడుకున్న సీన్ ఆకట్టుకుంది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణపై అప్పట్లో ఏపీ సీఎం జగన్ ఏకంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. తన ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టుల ద్వారా జోక్యం చేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. జగన్ రాసిన లేఖలు అప్పట్లో సంచలనమయ్యాయి.

కట్ చేస్తే.. తాజాగా అదే వ్యక్తిపై జగన్ పొగడ్తల వర్షం కురిపించారు. సీజేఐ అంత గొప్పోళ్లు లేరంటూ కీర్తించేశారు. అయితే కార్యక్రమాల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కార్యనిర్వహక వ్యవస్థ పరిధికి మించి ప్రవర్తిస్తే కోర్టులు జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనడం ఏపీ సర్కార్ ను పరోక్షంగా హెచ్చరించినట్టేనని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి తన సొంత గ్రామంలో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి.. దేశ అత్యున్నత స్థాయికి ఎదిగారు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం మర్యాద పూర్వక సత్కారం అందిస్తోంది. ఈరోజు సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తేనేటి విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ తోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరుకానున్నారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల తీరుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్వీ రమణ సుప్రీం కోర్టు న్యాయవాదిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తున్నారని ఈ లేఖలో ప్రస్తావించారు. రాజధాని కుంభకోణంతో పాటు రాష్ట్రంలో హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై జగన్ సుప్రీంకు రాసిన లేఖలో తెలిపారు. అంతేకాకుండా ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.ఈ లేఖపై తగు చర్యలు తీసుకోవాలని, ఏదీ సముచితమో అలాంటి తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. దీనిపై దేశవ్యాప్తంగా అనేక స్పందనలు వచ్చాయి. దేశస్థాయిలో ఉన్న ప్రముఖ న్యాయవాదులు జగన్ కు మద్దతు తెలిపారు. వారు సైతం జగన్ రాసిన లేఖపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ విషయం దేశంలోనే సంచలనంగా మారింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థ తీరును తప్పుపట్టేలా లేఖ రాయడం సర్వత్రా ఆసక్తిగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులైన తర్వాత ఇప్పటివరకూ ఆయనను సీఎం జగన్ కలిసింది లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీజేఐ రమణ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా జగన్ వెళ్లింది లేదు.

తాజాగా ఏపీలో మూడు రోజుల పాటు జస్టిస్ ఎన్వీ రమణ పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా సత్కరించింది. ఇద్దరు పరస్పరం వైరుధ్యం చూపిన అత్యున్నత వ్యక్తులు ఇలా పక్కపక్కనే కూర్చొని కలుసుకోవడం అరుదైన సందర్భమనే చెప్పొచ్చు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.