Begin typing your search above and press return to search.

సీజేఐ సంచలనం.. సీబీఐపై కీలక వ్యాఖ్యలు.. ఆయనేమన్నారంటే? లేదా

By:  Tupaki Desk   |   6 Aug 2021 11:32 AM GMT
సీజేఐ సంచలనం.. సీబీఐపై కీలక వ్యాఖ్యలు.. ఆయనేమన్నారంటే? లేదా
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ.. వినూత్న రీతిలో వ్యవమరిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలుగా ఉన్న సీబీఐ.. ఇంటెలిజెన్స్ బ్యూరోల తీరుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఎదుర్కొంటున్న అంశాల్ని ప్రస్తావించిన ఆయన.. న్యాయవ్యవస్థకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ మాత్రం సహకరించటం లేదన్న వ్యాఖ్య చేసేయటం సంచలనంగా మారింది.

జార్ఖండ్ లోని ధన్ బాద్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్యకు గురైన కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న జస్టిస్ ఎన్ వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం వేళలో ఆయన తన ఇంటి నుంచి వాకింగ్ చేయటానికి వెళ్లినప్పుడు ఒక ఆటో ఆయన్ను ఢీ కొట్టటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన కేసు విచారణను సుప్రీం సొంతం చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు వాస్తవ నివేదికను వారంలో సమర్పించాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్ వీ రమణ.. కేంద్ర దర్యాప్తు సంస్థల పని తీరు ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. ఈ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనేమన్నారంటే..

- తమకు బెదిరింపులు వచ్చాయని న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినప్పటికి న్యాయవ్యవస్థకు ఈ సంస్థలు సహకరించటం లేదు. గ్యాంగ్ స్టర్లు.. హై ప్రొఫైల్ వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసుల్ని విచారించే న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో మానసికంగా వేధింపులకు గురవుతున్నారు.

- సీబీఐ.. ఐబీలకు ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండటం లేదు. సీబీఐ వైఖరి యథాతధంగా సాగుతోంది. న్యాయ వ్యవస్థకు ఎలాంటి సాయం అందటం లేదు.

- వారు వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసెజ్‌లను పంపిస్తూ న్యాయమూర్తులను మానసికంగా వేధిస్తూ, బెదిరిస్తున్నారు. ఈ వేధింపులు, బెదిరింపులపై ఫిర్యాదులు చేసినప్పటికీ, సీబీఐ చేస్తున్నదేమీ లేదు.

- సీబీఐ వైఖరిలో మార్పు లేదని చెప్పాల్సి రావటం.. ఈ తీరులో వ్యాఖ్యానించాల్సి రావటం బాధాకరం.

- ప్రతికూల తీర్పు వచ్చినపుడు న్యాయమూర్తులను అపఖ్యాతిపాలు చేసే కొత్త ధోరణి మన దేశంలో వచ్చింది. న్యాయ మూర్తులు సీబీఐకి కానీ.. పోలీసులకు కానీ ఫిర్యాదు చేసినప్పటికీ ఆ వ్యవస్థలు స్పందించడం లేదు. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు ఏమాత్రం న్యాయ వ్యవస్థకు సహకరించడం లేదు.

జస్టిన్ ఎన్ వీ రమణ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. దాడుల నుంచి జడ్జిలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని.. దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన వద్ద ఉందన్న ఆయన..కొన్ని కఠిన చర్యల్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొనటం గమనార్హం.