Begin typing your search above and press return to search.

అప్పట్లో సీకే బాబునూ ఇలాగే..

By:  Tupaki Desk   |   17 Nov 2015 9:35 AM GMT
అప్పట్లో సీకే బాబునూ ఇలాగే..
X
ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్తే అప్పట్లో చిత్తూరు నగరం అట్టుడికిపోయింది. జిల్లాలో పవర్ ఫుల్ మ్యాన్ అనదగ్గ మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై నగరం నడిబొడ్డున సీకే బాబుపై కర్ణాటకకు చెందిన ఓ ముఠా సభ్యులు హత్యాయత్నం చేయడం.. ఆయనపై కాల్పులు జరపడం.. ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం. ఆ ఘటనలో సీకే బాబు గన్ మ్యాన్ జరిపిన కాల్పుల్లో ముఠా సభ్యుడొకరు చనిపోయాడు. మిగతా వాళ్లు తప్పించుకున్నారు. ఈ కేసులో ఎవరు నిందితులన్నది తేలనే లేదు. నాటి సంఘటన వెనుక తెలుగుదేశం నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. దివంగత ఎంపీ ఆదికేశవులు ఈ హత్యాయత్నం కోసం ఫైనాన్స్ చేశాడని సీకే బాబు అనుచరులు ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు మేయర్ హత్యతో మరోసారి చిత్తూరు వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో సీకే బాబు ప్రాణాలతో బయటపడ్డారు కానీ.. ఈసారి మేయర్ ప్రాణాలు కోల్పోవడం విచారకరం. కఠారి దంపతులతో సీకే బాబుకు విభేదాలున్న నేపథ్యంలో హత్యలతో ఆయనకు సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఈ హత్యల వెనుక సీకే బాబు హస్తం ఉందని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతోనే ఈ హత్యలకు కుట్ర జరిగిందంటున్నారు. సాధారణంగా ఓ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యర్థి పార్టీ నేతల మీద హత్యాయత్నాలు జరగడం మామూలే. కానీ అధికార పార్టీ నేతల మీద ఇలా దాడి జరగడం.. సాక్ష్యాత్తు మేయర్ ప్రాణాలు కోల్పోవడం.. ప్రతి పక్ష పార్టీ నేత మీద ఆరోపణలు రావడం విచిత్రం.